మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.
జిల్లా వ్యాప్తంగా 163 బీఎన్ఎన్ (144 సెక్షన్) అమలు.
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ డా. శబరీష్.
(నమస్తే న్యూస్, మహబూబాబాద్,సెంబర్ 16)
జిల్లా ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ డా. శబరీష్ కోరారు.ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.
డోర్నకల్, కురవి, సీరోల్, మరిపెడ, గంగారం, కొత్తగూడ మండలాల్లో నిర్వహించనున్న ఎన్నికల కోసం (05) మంది డీఎస్పీలు, (15) మంది సీఐలు, (50) మంది ఎస్‌ఐలు, సుమారు 1000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రాంతాలను రూట్లుగా విభజించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా తక్షణమే స్పందించేలా సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన రౌడీషీటర్లు, ట్రబుల్ మేకర్లను బైండోవర్ చేయడం జరిగిందన్నారు.ఎన్నికల ప్రక్రియకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అల్లర్లు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే గొడవలకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని, ఐదుగురికి మించి గుమికూడరాదని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నియమ నిబంధనలు అమలులో ఉంటాయని, వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు సీసాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వస్తువులకు అనుమతి లేదన్నారు.ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని, బాణాసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

