రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్న మారుమూల పల్లెలు.
దొనకొండ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల శ్రావణి సురేష్ సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవం.
లక్ష్మీపురం గ్రామంలో నల్ల ఆంజనేయులు సర్పంచ్ అభ్యర్థిగా, కోడి స్వామి ఉపసర్పంచ్ గా ఏకగ్రీవం.
(నమస్తే న్యూస్,దంతాలపల్లి, డిసెంబర్ 2):
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దంతాలపల్లి మండలంలో ప్రజాస్వామ్యానికి కొత్త దిశగా రెండు గ్రామాలు అడుగులు వేస్తున్నాయి. సాధారణంగా సర్పంచ్ పదవికి పోటీ పడే అభ్యర్థులు డబ్బు, మద్యం ఖర్చులు చేసి, గ్రామాల్లో వర్గీకరణలకు దారితీయడం సహజమే. అయితే ఈసారి గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా గ్రామస్తులు ఏకమై ఏకగ్రీవ ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.
గ్రామంలో ఉద్రిక్తతలు, కుటుంబాల మధ్య విభేదాలు, ఓటు కోసం ఖర్చులు… ఇలా ఎన్నో సమస్యలను తొలగించాలనే సంకల్పంతో ఈ రెండు పంచాయతీలు ముందుకు వచ్చాయి. పోటీ లేకుండా ‘అభివృద్ధి పనులు చేయగల వ్యక్తి’ ను ఎన్నుకుంటే ప్రభుత్వ గ్రాంట్లు కూడా లభిస్తాయి అనే అవగాహన గ్రామాల్లో పెరుగుతోంది. ఈ మేరకు గ్రామ పెద్దలు, యువకులు, మహిళా సంఘాలు కలిసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
లక్ష్మీపురం గ్రామంలో స్థానికులందరూ ఒకే భావనపై ఏకమై బీఆర్ఎస్ అభ్యర్థి నల్ల ఆంజనేయులు ను సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అలాగే కోడి స్వామి ని ఉపసర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయించారు. గ్రామానికి సంబంధించిన వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేయడం గమనార్హం.
ఇదే విధంగా దొనకొండ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల శ్రావణి సురేష్ ను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవం చేయడానికి గ్రామస్తులు అంగీకరించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీల కంటే గ్రామాభివృద్ధికే ప్రాధాన్యతనిస్తూ ప్రజలు ‘అందరూ కలిసే మంచి’ అన్న భావనతో ముందడుగు వేశారు.
గ్రామాల్లో గొడవలు లేకుండా, ఖర్చులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని సానుకూల దిశలో తీసుకెళ్తూ ఈ రెండు పంచాయతీలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.


