(నమస్తే న్యూస్,మహబూబాబాద్, జనవరి01) జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్‌ల చేతుల మీదుగా కలెక్టరేట్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలను “సీక్ సే సురక్ష – టెక్నాలజీ సే పరివర్తన్” అన్న నేపథ్యంతో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, బ్యానర్లు–పోస్టర్ల ద్వారా అవగాహన, సీట్‌బెల్ట్–హెల్మెట్ వినియోగంపై ప్రచారం, పాఠశాల–కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనపై అవగాహన కార్యక్రమాలు జనవరి 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనవరి 4 నుంచి 10 వరకు డ్రైవర్లకు కంటి పరీక్షలు, స్కూల్ బస్సుల భద్రతా తనిఖీలు, వ్యాసరచన–క్విజ్ పోటీలు, వేగ నియంత్రణ తనిఖీలు, పాదాచారుల భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. జనవరి 11 నుంచి 17 వరకు అధిక లోడుతో ప్రయాణించే వాహనాల తనిఖీలు, NSS–NCC వాలంటీర్ల ర్యాలీలు, టాక్సీ మరియు ఆటో డ్రైవర్లకు అవగాహన, ముగ్గుల పోటీలు, ఉత్తమ రోడ్డు భద్రత పాటిస్తున్న గ్రామాల ఎంపిక, సినిమా హాళ్లలో అవగాహన ప్రదర్శనలు, వాహనాల ఫిట్‌నెస్ మరియు పొల్యూషన్ సర్టిఫికేట్ల తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జనవరి 18 నుంచి 24 వరకు విద్యార్థుల పెయింటింగ్ పోటీలు, ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ, ఆర్టీవో కార్యాలయాల్లో ఆడియో సందేశాలు, నాటకాల ద్వారా అవగాహన, సైకిల్ మరియు ఎలక్ట్రిక్ వాహన ర్యాలీలు, బ్లాక్ స్పాట్‌ల సవరణ, బస్టాండ్లు–ఆటోస్టాండ్లలో కరపత్రాల పంపిణీ జరిగనున్నాయని అన్నారు. జనవరి 25 నుంచి 30 వరకు ప్రజా రవాణా భద్రత, సంబంధిత మొబైల్ యాప్‌లపై అవగాహన, రిఫ్లెక్టర్ స్టిక్కర్లు లేని భారీ వాహనాల తనిఖీలు, ప్రమాదాలపై అత్యవసర స్పందన, ప్రథమ చికిత్స శిక్షణ, వైద్యశాఖ–రెడ్‌క్రాస్ భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జనవరి 31న ఉత్తమ అధికారులు, వాలంటీర్లు, పాఠశాలలు, డ్రైవర్లకు అవార్డులు ప్రదానం చేసి, నెలవారీ నివేదికలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో జైపాల్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి చరణ్, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


