గ్రామపంచాయతీల అభివృద్ధితో డోర్నకల్ నియోజకవర్గాన్ని ముందంజలో నిలపాలి:
ఎమ్మెల్యే డా. రామచంద్రు నాయక్.
నర్సింహుల పేట మండల సర్పంచ్ లకు ఎమ్మెల్యే ఘన సన్మానం.
(నమస్తే న్యూస్, మరిపెడ,డిసెంబర్ 16)
నర్సింహుల పేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ ఘనంగా సన్మానించారు.మరిపెడ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గెలుపొందిన సర్పంచ్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, గెలిచినంత మాత్రాన పొంగిపోవడం గానీ, ఓడినందుకు కుంగిపోవడం గానీ తగదని సూచించారు.గ్రామపంచాయతీలను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో సమిష్టి బాధ్యతతో పనిచేస్తే డోర్నకల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందంజలో నిలపవచ్చని తెలిపారు.అదేవిధంగా గ్రామపంచాయతీల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

