లంచం తీసుకుంటూ
ఏసీబీ అధికారులకు దొరికిన ఏఈఓ
(నమస్తే న్యూస్,నవంబర్ 06 మరిపెడ): కుటుంబ పెద్ద మృత్యువాత పడి పుట్టెడు దుఃఖంలో ఉన్న యువ రైతు వద్ద లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు ఓ ఏఈఓ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గురువారం జరిగింది. వరంగల్ ఏసీబీ డీఎస్సీ సాంబయ్య కథనం ప్రకారం..మరిపెడ మండలంలోని అనే పురం గ్రామానికి చెందిన బిక్కు అనే రైతు అక్టోబర్ 14 వ తేదీన మృత్యువాత పడ్డాడు.కాగా నామినీగా ఉన్న రైతు కుమారుడు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన అన్ని ధ్రువీకరణ పత్రాలతో మరిపెడ వ్యవసాయ అధికారులను సంప్రదించి కార్యాలయంలో బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గా విధులు నిర్వహిస్తున్న సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద రూ. 20 వేలు డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో సదరు బాధిత రైతు నేరుగా వరంగల్లోని ఏసీబీ అధికారులను సంప్రదించగా గురువారం మరిపెడ మండల కేంద్రంలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా దరఖాస్తుదారుల నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డీఎస్సీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందని డీఎస్సీ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు రాజు, శేఖర్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

