- తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన రామోజీ గ్రూప్ : సీఎం రేవంత్
- రామోజీ 89వ జయంతి సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం.
- హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు.
(నమస్తే న్యూస్,హైదరాబాద్, నవంబర్ 17)
తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి రామోజీ గ్రూప్ సంస్థలు విశిష్ట గుర్తింపు తెచ్చిపెట్టాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ తరహాలోనే రామోజీ ఫిల్మ్ సిటీ కూడా నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిందని పేర్కొన్నారు.రామోజీ రావు 89వ జయంతి సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
"రామోజీ పేరు కాదు... బ్రాండ్" - సీఎం రేవంత్
ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామోజీ రావు ఎలాంటి రంగంలో అడుగుపెట్టినా ఆ రంగానికి ప్రత్యేక గుర్తింపు సంపాదించారని అన్నారు. వయసు పైబడినప్పటికీ నిబద్ధతతో పని చేయడం ఆయన జీవన విధానమని కొనియాడారు.“రామోజీ పేరు కాదు... ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కొనసాగేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది” అని తెలిపారు.
ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రామోజీ ఫిల్మ్ సిటీ
తెలుగు సినిమా నంది అవార్డుల నుంచి ఆస్కార్ స్థాయి గుర్తింపునకు చేరుకునే ప్రయాణంలో రామోజీ ఫిల్మ్ సిటీ కీలక పాత్ర పోషించిందని సీఎం రేవంత్ అన్నారు.
“టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు... హాలీవుడ్ సంస్థలు కూడా స్క్రిప్ట్‌తో వచ్చి షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లే సౌకర్యం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది’’ అని పేర్కొన్నారు.
తెలుగు భాష అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, పరిపాలనా వ్యవహారాల్లో కూడా తెలుగు వినియోగం పెంచుతామని సీఎం తెలిపారు.
ఏడుగురు ప్రముఖులకు ఎక్సలెన్స్ అవార్డులు
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన జర్నలిజం: జైదీప్ హర్దీకర్మా నవతా సేవ: పల్లబి ఘోష్ (Impact And Dialogue Foundation),పర్యావరణ సేవ: అమలా అశోక్ రూయా,సామాజిక విద్యా రంగం: ఆకాశ్ టాండన్ (Pehchaan School),ఆదివాసీ భాషల పరిరక్షణ: ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ,సైన్స్ & టెక్నాలజీ: డాక్టర్ మధవీ లత,పారిశ్రామిక రంగం: శ్రీకాంత్ బొల్లా అను ఈ ఏడుగురు వ్యక్తులు అవార్డులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూప్ చైర్మన్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు.




