మరోసారి 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసిల్దార్.
(నమస్తే న్యూస్,ఇల్లందు, నవంబర్ 17)
లంచాలకు పాల్పడుతూ ఇప్పటికే ACB కేసులో చిక్కుకున్న ఉద్యోగి… మళ్లీ అదే తీరును ప్రదర్శించాడు. 30,000 రూపాయలు లంచంగా స్వీకరిస్తూ ఈసారి కూడా ఏసీబీ బృందానికి అడ్డంగా చిక్కాడు.ఇల్లందు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన దాడుల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ మహమ్మద్ యాకుబ్ పాషా అతని సహాయకుడు ఈ–పాస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ లను రంగే చేతిలో పట్టుకున్నారు.
రేషన్ డీలర్ల నుంచి వసూలు – మధ్యవర్తిగా సంఘం అధ్యక్షుడు
ఇల్లందు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుని ద్వారా ఒక రేషన్ డీలర్ నుంచి 30 వేల రూపాయలు వసూలు చేస్తున్న సమాచారం ఏసీబీకి అందింది. అదే మేరకు పాశాకు డిమాండ్ చేసిన లంచం రాకెట్‌పై పన్నాగం పన్ని, శబరిష్‌కు చెందిన సెల్‌ఫోన్ దుకాణం వద్ద డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
తూకాల్లో తేడా పేరుతో డబ్బు డిమాండ్.
నవంబర్ 7న టేకులపల్లి మండలంలోని ఒక రేషన్ షాప్‌లో తూకాల్లో తేడా ఉందని పేర్కొంటూ పాషా 30 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ మొత్తం అతని సహాయకుడు విజయ్ ద్వారా తీసుకుంటున్నపుడు సాక్ష్యాధారాలతో పట్టుకున్నట్టు డీఎస్పీ రమేష్ తెలిపారు.
2011లో కూడా లంచం కేసులో పట్టుబడ్డవాడే.
పాషా వివాదాలు కొత్తకాదు.2011లో కొనిజర్లలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తూ ఒక వైద్యుడి నుంచి 30 వేల లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విషయం అధికారులు గుర్తు చేశారు. జిల్లాలోని సివిల్ సప్లై శాఖలో పాషాపై అత్యధిక ఫిర్యాదులు నమోదయ్యాయని డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు.
కొనసాగుతున్న విచారణ.
పట్టుబడిన పాషా, సహాయకుడు విజయ్‌లను ఇల్లందు తహసిల్దార్ కార్యాలయానికి తరలించి ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. లంచం డబ్బులు, ఫోన్ కాల్ రికార్డులు, సంబంధిత పత్రాలను సీజ్ చేసినట్లు సమాచారం.

