కేసులు–దాడులు కాదు… గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచండి.
కరోనాకాలం నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రజలకు సేవలందిస్తున్న ఆర్.ఎం.పిలు,పి.ఎం.పీ లు.
వందల కుటుంబాలను రోడ్డుమీదకు ఈడ్చుతున్న అధికారుల దాడులు.
ఆర్.ఎం.పిలు–పి.ఎం.పీ లపై అధికారుల దాడులు నిలిపివేయాలి.
తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ ఐక్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉక్కుల అశోక్.
(నమస్తే న్యూస్,నల్గొండ-రంగారెడ్డి , నవంబర్ 17)
తెలంగాణ ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థిలో ఉందని,ఒక వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్య వైద్యం, మందుల కొరత, సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతుండగా … మరో వైపు — గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రాథమిక చికిత్స అందిస్తున్న ఆర్ఎంపి–పిఎంపీలపై అకస్మాత్తుగా కేసులు, దాడులు జరుగుతుండటం ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తోందనీ. ఏదో ఒక సంఘటనను చూపించి, మొత్తం వ్యవస్థను నిందించడం న్యాయమా అని తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్ మండిపడ్డారు.
జగద్గిరిగుట్ట ధన్వంతరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధన్వంతరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎంపి పి.ఎం.పి ల వ్యవస్థను రూపుమాపాలని లక్ష్యంతో సాగుతున్న దాడులు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల 17 మంది పిల్లలకు ఇంజక్షన్ వికటించిన ఘటన… ప్రభుత్వం ఆసుపత్రుల్లో ‘వాస్తవ చిత్రం కాదా అని,నాగార్జునసాగర్ ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల జరిగిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిందనీ. జ్వరంతో వచ్చిన చిన్నారులకు సిస్టమాటిక్ చెకప్ లేకుండానే ఇచ్చిన ఇంజెక్షన్లు అరగంటకే తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి.వాంతులు… విరోచనాలు… అధిక జ్వరం… కొందరికి ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం… కండరాలు బిగుసుకుపోవడం—ఇలా ఒకేసారి 17 మంది చిన్నారులు ప్రాణాపాయానికి చేరుకున్నారనీ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో 7 నెలల గర్భిణి పంతంగి మానసను రొటీన్ చెకప్ పేరుతో ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు ఎదురైన పరిస్థితి అర్హత ఉన్న వైద్యుల వల్లే జరిగిందని ప్రజలు తిరగ బడ్డారనీ గుర్తుచేశారు.
కరోనాకాలంలో ప్రభుత్వ యంత్రాంగం మూగబోయినప్పుడు గ్రామీణ వైద్యులే ప్రజలతో ఉన్నారనీ,2020–2022 కరోనా మహామ్మారి కాలాన్ని మర్చిపోవడం ప్రజలకు అసాధ్యమని, ఆ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోయాయి,డాక్టర్లు చాలావరకు అందుబాటులో ఉండలేదనీ.ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు ఆకాశమంత ఎత్తుకెళ్లాయి.పల్లెల్లోకి ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది చేరే అవకాశం చాలా తక్కువ,ఆ సమయంలో RMP–PMPలే పల్లెలలో ప్రజల బాటలో నడిచారు.
కరోనా కాలంలో ఆర్ఎంపి–పిఎంపీలు చేసిన సేవలు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం ఉన్న వారిని గుర్తించారు.ఔషధాలు అందించారు.ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేశారు.వెంటిలేషన్ అవసరమైన వారిని సమయానికి పంపించారు.రాత్రి, పగలు… ఏ సమయమైనా అందుబాటులో నిలిచారు.ప్రజలు భయంతో వణికిన సమయంలో మానసిక ధైర్యం ఇచ్చారు.గర్భిణులు, వృద్ధులకు అవసరమైన సపోర్ట్ అందించారు.అది వైద్యం మాత్రమే కాదు…అది సేవ.. బాధ్యత.ఇప్పుడు ఆ సేవలను మర్చిపోయి కేసులు పెట్టడం న్యాయమా? ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను కారణంగా చూపిస్తూ…ఒకేసారి ఆర్ఎంపి–పిఎంపీలపై దాడులు, కేసులు, దౌర్జన్య చర్యలు కొనసాగించడంపై గ్రామీణ ప్రజలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ అందుబాటులో లేకపోతే మా పిల్లలకు ప్రాథమిక చికిత్స ఎవరిని అడగాలి?గ్రామంలో ఒక రాత్రి అత్యవసరం వస్తే ఎవరిని పిలవాలి? వైద్యం అందించే వారు లేని సమయంలో… ఇళ్లకే వచ్చి సేవ చేసిన వారిని ఇప్పుడు నేరస్తులుగా ఎందుకు చూపిస్తున్నారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు RMP–PMPలు వెన్నెముక గా ఉన్నారని అన్నారు.ఒక పల్లెలో 300–400 కుటుంబాలు ఉంటే… అక్కడ ప్రభుత్వ వైద్యుడు నెలలో 3–4సార్లు మాత్రమే కనిపించే పరిస్థితి.కానీ RMP–PMP?ఎప్పుడైనా అందుబాటులో ఫోన్ చేస్తే వెంటనే వచ్చే వారు.ప్రాథమిక చికిత్సలో అనుభవం ఉన్న వారు.ప్రజల ఆరోగ్య పరిస్థితులను బాగా తెలిసిన వారు.ఈ స్థాయిలో గ్రామానికి దగ్గరగా ఉన్న వైద్య సేవ ఎవరు అందిస్తున్నారనీ ప్రశ్నించారు.గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ 60% భారం ఆర్ఎంపి–పిఎంపీలే మోస్తున్నారనీ వారిపై అధికారులు చెస్దాతున్న దాడులు వందల కుటుంబాలను రోడ్డుపైకి ఈడుస్తున్నాయనీ వారి పిల్లల చదువులు, లోన్లు, జీవనాధారం పూర్తిగా ప్రమాదంలో పడుతుందనీ,గత రెండు నుండి మూడు దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వృత్తినీ ఆపివేసి ఎంతో మంది జీవనం ప్రశ్నార్థకంగా మారిందని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించి వారిని ఆరోగ్య వ్యవస్థలో భాగం చేయాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి నవీన్ కుమార్, ధన్వంతరి సంఘం అధ్యక్షుడు వంగూరి విష్ణు, గోవర్ధన్, నాగభూషణం, ధన్వంతరి సంఘం నాయకులు , సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





