- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కై నిరసన.
- ఎమ్మెల్యే స్పందించి డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలి.
- రాబోయే ఎన్నికల్లో గద్దె దింపుతాం.
- బారీగా పాల్గొన్న నిరుపేదలు.
(నమస్తే న్యూస్,తొర్రూరు, నవంబర్ 9)
తొర్రూరులో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం ప్రజా పాలనలో పేదల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా సహాయ కార్యదర్శి డోనక దర్గయ్య అన్నారు.ఆదివారం తొర్రూరు మండల కేంద్రంలోని గోపాలగిరి రోడ్ వద్ద 280 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కోసం జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు నెలలుగా ధర్నాలు, వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇల్లు లేని పేదలకు గృహాలు ఇవ్వకుండా పాలకులు దున్నపోతుపై వర్షం కురిసినట్లు ప్రవర్తిస్తున్నారు. మహిళలు సంఘటితంగా పోరాడినా ఒక్కసారైనా ఎమ్మెల్యే వారిని పరామర్శించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేద మహిళలకు పంపిణీ చేయాలని, లేకపోతే ప్రజలు రాబోయే ఎన్నికల్లో గద్దె దింపుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం తొర్రూరు పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకన్న, మండల కమిటీ సభ్యులు జమ్ముల శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి. అమీర్, సిపిఎం పార్టీ సభ్యులు కొమ్మనబోయిన పుష్ప, దస్తరి వెంకటేష్, పోరాట కమిటీ నాయకులు ఎడ్ల ధర్మయ్య, కల్లూరి భవాని, గద్దల మంజుల, గడ్డల సాయిలు, మంగళపల్లి నవనీత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

