- పసిపిల్లల పౌష్టిక ఆహార..! సరఫరాకు తూట్లు..!
- అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం కోడిగుడ్లు
- మేడిపండు సామెతను తలపించేలా అంగన్వాడి కేంద్రాలలో కోడిగుడ్లు
- సరఫరా చేసే కాంట్రాక్టర్ల పై నియంత్రలేక అక్రమాలు
- అంగనవాడి కేంద్రాలపై నిఘ కొరవడింది అంటూ ఆరోపణలు
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, నవంబర్ 13)
చిన్నారులు,గర్భిణులు,బాలింతలు పోషక లోపాలను అధిగమించేందుకు మహిళా అభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ పౌష్టికారాన్ని పంపిణీ చేస్తుంది. ఒక్కో లబ్ధిదారునికి ప్రతి నెల 16 కోడిగుడ్లు అందించాలి.గుడ్లు అయితే ఇస్తున్నారు గాని... అందులో నాణ్యత లేని కుళ్లిపోయి వస్తున్నాయని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.. దంతాలపల్లి మండలంలోని అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్ల పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం కోడుగుడ్లు, తక్కువ బరువు ఉన్నవి, చిన్నవి, నిలువ అయిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారని,సరఫరా చేసిన రెండు,మూడు రోజులకే కుళ్లిపోయి పురుగులు పట్టి దుర్వాసన వస్తున్నాయని మండల ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ లోపం కారణంగా ఇలా నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారని, గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను నియంత్రించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని అంగన్వాడి సిబ్బంది,ప్రజలు వాపోతున్నారు. మంచి పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి కొందరు తూట్లు పొడుస్తున్నారని, ఇప్పటికైన సంబంధిత జిల్లా అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన కోడిగుడ్లను సరఫరా చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




