- తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలపై తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించాలి.
- అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో పంటల పరిశీలన.
(నమస్తే న్యూస్, నరసింహులపేట, అక్టోబర్ 30)
మండలంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) తొర్రూరు విభాగ కమిటీ ఆధ్వర్యంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటల పరిస్థితిని పరిశీలించారు.రాష్ట్రంలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో రైతులు పూర్తిగా కుదేలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.32 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దంతాలపల్లి–నరసింహులపేట ప్రాంతాల్లో ఏఐకేఎంఎస్ విభాగాధ్యక్షుడు చిర్ర యాకన్న నాయకత్వంలో బృందం తుఫాన్ కారణంగా నాశనం అయిన పంట పొలాలను పరిశీలించింది.ఈ సందర్భంగా చిర్ర యాకన్న మాట్లాడుతూ “అన్ని రకాల పంటలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు 50 శాతం పెరిగాయి — ఎరువులు, విత్తనాలు, కూలీల చెల్లింపులు ఆకాశాన్నంటాయి. కానీ దిగుబడి 40 నుంచి 60 శాతం తగ్గింది. మిగిలిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లేదు. మార్కెట్‌లో గిట్టుబాటు లేక రైతులు రోజువారీ జీవనానికి పోరాడుతున్నారు. అప్పులు, ఆర్థిక ఒత్తిడి రైతు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి,” అని పేర్కొన్నారు.
ప్రభుత్వం వైఫల్యాలు
తుఫాన్‌కు ముందస్తు చర్యల లోపం: వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం రైతులకు సరైన సూచనలు, సహాయం చేయలేదు. పొలాల్లో నీటి నిల్వ వ్యవస్థలు దెబ్బతిన్నాయి .ఇది ప్రణాళికా లోపం వల్లే.పంట నష్టం అంచనా ఆలస్యం: 4.4 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా నాశనమైపోయినా, అధికారులు ఇంకా “పరిశీలిస్తున్నాం” అంటున్నారు. రైతు బాధలు పెరుగుతుండగా, మంత్రులు పర్యటనలతోనే సరిపెడుతున్నారు – సాయం ఎప్పుడు అందుతుంది? కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం, రైతులకు నిర్లక్ష్యం: కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడంతో కార్పొరేట్ కంపెనీలు ధాన్యం, పత్తి పంటలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. రైతుల ఖర్చులు పెరిగినా, ఆదాయం శూన్యంగా మారింది.తక్షణ అమలులోకి తేవాల్సిన డిమాండ్లు ప్రతి ఎకరాకు ₹25,000 పరిహారం 15 రోజుల్లో చెల్లించాలి.పంటల నష్టానికి పూర్తి అంచనా నివేదిక, మరియు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.వ్యవసాయ రుణాలను మాఫీ చేసి, ఉచిత ఎరువులు, విత్తనాలు అందించాలి.రైతు కుటుంబాలకు నెలకు ₹10,000 పెన్షన్ మంజూరు చేయాలి.ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తారని ఈ కార్యక్రమంలో జక్కుల యక సాయిలు, చిమ్ముల కమలాకర్, హెచ్. యాకయ్య, యాకన్న, మంచాల కొమరయ్య, ఆదిరెడ్డి, పాషా తదితరులు హెచ్చరించారు.


