హనుమకొండలో ప్రైవేటు పాఠశాలలో దారుణం...
9 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
(నమస్తే న్యూస్ బ్యూరో ,అక్టోబర్ 24 ,వరంగల్ )
ప్రైవేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఘటనలు వరుసగా కలకలం రేపుతున్నాయి. తాజాగా హనుమకొండ నగరంలోని నాయుమ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ (9) అనే బాలుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
ఉదయం ఇంటి నుండి ఆరోగ్యంగానే స్కూల్‌కు వెళ్లిన సురజిత్ తరగతిలో ఉండగా ఒక్కసారిగా తలనొప్పితో బాధపడడం ప్రారంభించాడు. వెంటనే బెంచ్‌పై కూలిపోవడంతో టీచర్ అప్రమత్తమై స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు బాలుడిని తక్షణమే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా తేల్చి మరణం ధ్రువీకరించారు.సంఘటన విషయం తెలిసి ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడు ఇలా ఎలా చనిపోయాడో స్పష్టత ఇవ్వాలని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. యాజమాన్యంపై నిర్లక్ష్యం, దుర్వినియోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు.విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. తల్లిదండ్రులు, బంధువులను ప్రశాంతంగా ఉండమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, బాలుడి మరణం వెనుక ఏదో అనుమానాస్పదం ఉందని కుటుంబసభ్యులు పట్టుబడుతున్నారు.
ఈ ఘటనతో మరోసారి ప్రైవేట్ విద్యాసంస్థల భద్రతా ప్రమాణాలు, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం అంశాలు చర్చనీయాంశంగా మారాయి

