జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు.
(నమస్తే న్యూస్ బ్యూరో,అక్టోబర్ 24 ,హైదరాబాద్ )
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ పటిమ మరింతగా పెరిగింది. ఈసారి ఏకంగా 58 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలో నిలిచారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక సంఖ్య. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల్లో ప్రాంతీయ సమస్యలు, నిరుద్యోగం, పెన్షన్లు, భూ నిర్వాసితుల డిమాండ్లు ప్రధాన చర్చాంశాలుగా మారాయి. రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించిన వివరాల ప్రకారం, మొత్తం 211 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 81 మంది అభ్యర్థులు అర్హులుగా తేలగా, చివరి తేదీకి ముందు 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది జాబితాలో 58 మంది అభ్యర్థులు నిలిచారు.
ఇది గత ఎన్నికలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. 2009లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో 18 మంది, 2023 సాధారణ ఎన్నికల్లో 19 మంది మాత్రమే పోటీ చేశారు.
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జరుగుతున్న ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది.బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత,బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి,కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలతో ఈ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

