(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
దసరా సెలవుల్లో ఉత్సాహంగా తిరిగిన ఇద్దరు స్నేహితులు సరదాగా ఈతకు వెళ్లి ఆకేరు వాగులో మునిగి, అనంత లోకాలకెగిసిన ఘటన జయపురం గ్రామ శివారు బక్కతండాలో చోటు చేసుకుంది.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల జయపురం గ్రామ శివారు బక్కతండాకు ఆనుకుని ప్రవహిస్తున్న ఆకేరు వాగులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులైన గుగులోతు సతీష్ (16) వాంకుడోత్ కార్తీక్ ( 16) లు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.శుక్రవారం సాయంత్రం బయటికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తక్షణమే పరిసర ప్రాంతాల్లో వెతకగా ఆకేరు వాగు ఒడ్డుకు విద్యార్థులు వెళ్లిన ద్విచక్ర వాహనం వారి చెప్పులు ,వారి బట్టలు కనిపించడంతో నీటిలో మునిగి ఉంటారని భావించి స్థానిక నర్సింహులపేట పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో తండావాసులు వాగులో వెతకగా శనివారం ఉదయం రెండు గంటలకు ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఒకరు నర్సింహులపేట మండలం జయపురం గ్రామ శివారు బక్కతండాకు చెందిన గుగులోత్ కోట్యా ,కవిత దంపతుల కుమారుడు గుగులోత్ సతీష్(16) తొర్రూరు లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదుతున్న విద్యార్థిగా గుర్తించారు.మరొకరు బద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు(పాల్వంచ)మండలం పోలారం తండాకు చెందిన వాంకుడోత్ శంకర్ ,సరోజ ల కుమారుడు వాంకుడోత్ కార్తీక్(16) గా గుర్తించారు.సతీష్, కార్తీక్ లు సమీప బంధువులు కాగా చిన్నప్పటినుండి కలిసిమెలిసి తిరిగే వారిని ,సెలవులు వచ్చాయంటే ఇద్దరు కలిసి పోయేవారని, దసరా వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా గడిపి ,కళ్ళ ముందే గంతులేసిన విద్యార్థులు విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేల రోదిస్తున్నారు .విద్యార్థుల మృతదేహాలను చూచి తండావాసులు కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. కాగా ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న నర్సింహులపేట పోలీసులు ,పోస్ట్ మార్టం నిమిత్తం ఇరువురి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


