కనుమరుగవుతున్న మానవత్వం,రాక్షసులుగా మారుతున్న '(రా)బంధువులు'.
పిల్లను ఇచ్చిన మామను కొట్టి చంపిన అల్లుడు మరియు కుటుంబ సభ్యులు.
కూతురు ఆపదలో ఉందని,అల్లుడి ఇంటికి వెళ్ళిన మామ,బావమరిది.
పిడిగుద్దులతో విరుచుకునిపడిన అల్లుడు, మరియు కుటుంబ సభ్యులు.
తీవ్ర అస్వస్థతతో అక్కడికక్కడే మృత్యువాతవడిన మామ.
(నమస్తే న్యూస్,మహబూబాబాద్, డిసెంబర్ 12)
తన తల్లిదండ్రులతో కలిసి పిల్లనిచ్చిన మామనే ఓ అల్లుడు కొట్టి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అదనపు కట్నం వేధింపులు, దాంపత్య కలహాలు చివరకు హత్యకు దారి తీసిన ఈ విషాద ఘటన మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
మహబూబాబాద్ పట్టణంలోని బాలాజీ హిల్స్, పాత కలెక్టర్ కార్యాలయ ప్రాంతానికి చెందిన బానోత్ లాలూనాయక్ తన కూతురు శ్రీసాయిలహరిని కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్ద తండాకు చెందిన గుగులోత్ గాంధీబాబు (సీతారాం కుమారుడు)కు ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం కోసం గాంధీబాబు, అతని తల్లిదండ్రులు సీతారాం, కవితతో పాటు కుటుంబ సభ్యులు శ్రీసాయిలహరిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
గురువారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో శ్రీసాయిలహరి తన తండ్రి లాలూనాయక్‌కు ఫోన్ చేసి భర్తతో పాటు అత్తమామలు కలిసి తనపై దాడి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని వాపోయింది. దీంతో ఆందోళన చెందిన లాలూనాయక్ తన కుమారుడు ప్రదీప్‌తో కలిసి మహబూబాబాద్ మిలిటరీ కాలనీలోని నిందితుల ఇంటికి చేరుకున్నారు.
అక్కడికి వెళ్లగానే గాంధీబాబు, అతని తల్లిదండ్రులు ముగ్గురు కలిసి లాలూనాయక్‌పై చేతులతో, పిడిగుద్దులతో తీవ్రంగా దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రదీప్‌పైన కూడా దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో లాలూనాయక్ ఛాతీ భాగంతో పాటు శరీరంలోని పలుభాగాలపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రదీప్ కూడా గాయపడగా చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై మృతుని కుమారుడు ప్రదీప్ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు ఆయన వెల్లడించారు

