కాంగ్రెస్ కోసం పోరాడితే శిక్షలు, దొరల చుట్టూ తిరిగితేనే పదవులు.
ప్రజలు కాంగ్రెస్‌ను చూసి ఓటేశారు గానీ ఈ ఎమ్మెల్యేలను చూసి కాదు.
ఇకపై ప్రజల కోసం స్వతంత్ర జర్నలిస్ట్‌గా పని చేస్తాను.
ప్రజా పాలనలో కూడా పార్టీ ' దొరల గడి'ల్లో బంధీగా ఉంది.
- మాజీ అధికార ప్రతినిధి డి.వై. గిరి
కాంగ్రెస్ పార్టీకి మాజీ అధికార ప్రతినిధి డి.వై. గిరి రాజీనామా.
(నమస్తే న్యూస్ డెస్క్,హైదరాబాద్, నవంబర్ 23 ):
మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. పార్టీ కోసం 11 సంవత్సరాల పాటు నిరంతరం పనిచేసిన టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి డి.వై. గిరి సోమవారం తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు పంపిన రాజీనామా లేఖలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కోసం పోరాడితే శిక్షలు, దొరల చుట్టూ తిరిగితేనే పదవులు, ఇదే ఇప్పుడు పార్టీ పరిస్థితి అంటూ గిరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీనామా లేఖలో గిరి పేర్కొన్న వివరాల ప్రకారం — రెండు సార్లు కురవి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసిన తనకు పార్టీ నుంచి ఒక్క శ్రద్ధా, రక్షణా లభించలేదని బాధపడ్డారు. TRS ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో తాను అనేక కేసులు, రౌడీ షీట్లు, అరెస్టులు ఎదుర్కొన్నప్పటికీ, ఆ సమయంలో జిల్లా స్థాయి నాయకులు ఎవ్వరూ తనకు అండగా నిలవలేదని గిరి ఆరోపించారు. “పార్టీ కష్టకాలంలో పోరాడిన వారిని విస్మరించి, పార్టీకి ఓటమి తెచ్చిన వారికే ఇప్పుడు పెద్దపదవులు. జిల్లాలో కాంగ్రెస్ ఆఫీస్ కూడా ఒక్క కుటుంబం నియంత్రణలో బందీగా ఉంది. దొరతత్వం కాంగ్రెస్‌లో పెచ్చరిల్లుతోంది” అని మండిపడ్డారు.
మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేల వైఖరిపై కూడా గిరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజలు కాంగ్రెస్‌ను చూసి ఓటేశారు గానీ ఈ ఎమ్మెల్యేలను చూసి కాదనీ,కానీ గెలిచిన వెంటనే ఇదంతా తమ వల్లే సాధ్యమైందన్న అహంకారంలో నాయకత్వం పట్ల కూడా గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చి, సెటిల్‌మెంట్ రాజకీయాలు జిల్లాలో మళ్లీ బలంగా మెుదలయ్యాయని, ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మిన వేళ ఇలాంటి చర్యలు పార్టీకే నష్టం కలిగిస్తున్నాయన్నారు. ముఖ్యంగా, పార్టీ విలువలను పక్కనబెట్టి ఎమ్మెల్యే భార్యను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడం కాంగ్రెస్‌కు అవమానమని, ఇది జిల్లాలో పార్టీని బలహీనపరిచే నిర్ణయం అని అన్నారు.
ఇలాంటి విధానాల్లో పార్టీకి కట్టుబడి పనిచేసే వారికి స్థానం లేదు. పోరాడేవారికంటే పాదాల దగ్గర కూర్చొనే వారిని పదవుల్లోకి తెస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌లో నా 11 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలుకుతున్నాను. ఇకపై ప్రజల కోసం స్వతంత్ర జర్నలిస్ట్‌గా పని చేస్తానని గిరి స్పష్టంగా తెలిపారు. తన రాజీనామా లేఖ ప్రతిని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు కూడా పంపినట్లు పేర్కొన్నారు.

