- ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.
- రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు – సున్నిత ప్రాంతాలపై నిఘా పెంపు.
- అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే న్యూస్):
దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అప్రమత్తత పెరిగింది. నగర పోలీస్ కమిషనర్ సీ.వి. ఆనంద్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, పాతబస్తీ ప్రాంతాల్లో వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన పోలీసు అధికారులకు ఆదేశించారు.నగర పరిధిలో నాకాబందీ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమీక్ష నిర్వహించి పలు రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్‌లో కూడా పోలీసులు అప్రమత్తమై పాతబస్తీ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, మాల్‌లు, థియేటర్ల వద్ద బాంబ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు.సీపీ సజ్జనార్ మాట్లాడుతూ "ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలపై దృష్టి ఉంచాలి” అని విజ్ఞప్తి చేశారు.



