తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...
'పంచాయతీ'లకు బంపర్ ఆఫర్.
ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక చేస్తే… రూ.10 లక్షల గ్రాంట్.
(నమస్తే న్యూస్ డెస్క్, హైదరాబాద్, నవంబర్ 22)
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విషయంలో జరుగుతున్న గందరగోళం త్వరలోనే తగ్గే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ ప్రయత్నాలు కోర్టుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు తాజా తీర్పు రావడంతో, ముందుగా విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల తేదీలు వెలువడతాయని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీగా ఉంది.
ఏకగ్రీవం చేస్తే గ్రామానికి ఏకకాల నిధులు.
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం పెద్ద బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్రామంలోని పెద్దలు, నాయకులు, ప్రజలందరూ కలిసి చర్చించి…ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటే, అలాంటి పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ కూడా విడుదల
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది.నవంబర్ 20 నుంచి 23 వరకు గ్రామాల్లోనే ఓటర్ల జాబితా సవరిస్తారు.దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు పంపించారు.
రిజర్వేషన్ అంశంపై కమిషన్ నివేదిక
రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తాజాగా తన నివేదికను సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకుండా ఉండాలని కమిషన్ సిఫారసు చేసింది.దీంతో గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఈసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాకపోవడంతో…పార్టీ స్థాయిలో అయినా బీసీలకు 42 శాతం మేర సీట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.

