ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారిణి.
పాలకుర్తి సబ్ డివిజన్‌లో అవినీతి కలకలం .
10 వేల రూపాయల లంచం స్వీకరిస్తూ పట్టుబడిన అధికారిణి.
(నమస్తే న్యూస్ డెస్క్, వరంగల్ – నవంబర్ 21)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. జనగాం జిల్లా పాలకుర్తి సబ్-డివిజన్ మిషన్ భగీరథ (INTRA) విభాగంలో పని చేస్తున్న ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ (డీఈఈ) కూనమల్ల సంధ్యారాణి అవినీతి కేసులో ఏసీబీ వలలో చిక్కారు.ఫిర్యాదుదారుడు పూర్తిచేసిన మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేసి, చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజనీర్‌కు పంపించేందుకు ₹10,000 లంచం కోరినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.అయితే, సంధ్యారాణి ఆ మొత్తాన్ని స్వయంగా కాకుండా తన ప్రైవేట్ సహాయకుడు మహేందర్ UPI ఖాతా ద్వారా స్వీకరిస్తూ ఉండగా, ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మిషన్ భగీరథ విభాగంలో ఒకింత కలకలం రేగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా పలువురు అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కిన, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ అవినీతి తగ్గినట్లుగా కనిపించిన దాఖలాలు లేవు. కేవలం బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సంఘటనలో మాత్రమే అధికారులు పట్టుబడుతున్నారు. నిరక్షరాసులు అమాయకులు ఎంతోమంది అధికారులు డిమాండ్ చేసిన లంచాలు సమర్పించుకుంటున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏసీబీ అధికారులకు చిక్కిన , అవినీతి అధికారులకు కఠిన శిక్షలు పడితేనే దోపిడీ ఆగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

