రక్త సిక్తమవుతున్న రహదారులు.- చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 24కి చేరిన మృతులు.
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి.
- చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 24కి చేరిన మృతులు.
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి.
(నమస్తే న్యూస్ బ్యూరో, రంగారెడ్డి, నవంబర్ 03):
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆదివారం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న బస్సుపై కంకర లోడు పూర్తిగా పడిపోవడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రస్తుతం మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం. గాయపడిన వారిలో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు, వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్లోని పలు కళాశాలలు, కంపెనీలకు వెళ్లేవారని తెలిసింది.ఆదివారం సెలవు దినం కావడంతో గ్రామాలకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా హైదరాబాద్–బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వికారాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఎమ్మెల్యే యాదయ్యకు ప్రజల నిరసన
ప్రమాద స్థలానికి చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేద"ని ప్రజలు మండిపడ్డారు.ఎమ్మెల్యేను చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, ప్రజలతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పే అవకాశముండటంతో పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు.

