దీపావళి ఆఫర్లతో మోసాలు..!
(నమస్తే న్యూస్ ,మహబూబాబాద్, అక్టోబర్ 17)
దీపావళి పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని జిల్లా పోలీసు అధికారి సుధీర్ రమ్నాథ్ కేకన్, ఐపీఎస్ తెలిపారు. స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్లు, వెబ్‌సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన చెప్పారు.నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి బ్యాంక్ అకౌంట్ వివరాలు, OTPలు, యూపీఐ పిన్‌లు అడిగి ఖాతాల్లోని డబ్బులను ఖాళీ చేస్తున్నారని వివరించారు. అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ.8.5 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్పారు.పోలీసులు వివరించిన మోసాల పద్ధతులు ఇలా ఉన్నాయి –నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలను ఆకర్షించడం.వాట్సాప్, SMS, టెలిగ్రామ్‌ల ద్వారా ఫిషింగ్ లింకులు పంపించడం.అప్రమత్తత లేని వారికి యాప్‌లు డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించి మోసం చేయడం.ప్రజలు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ధృవీకరించిన వెబ్‌సైట్లు, అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద లింకులు లేదా APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. ఎవరికీ బ్యాంక్ వివరాలు, OTP, యూపీఐ పిన్‌లు పంచుకోవద్దని, ముందుగానే చెల్లింపులు చేయకుండా “క్యాష్ ఆన్ డెలివరీ” సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయమని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.“మోసపోకుండా జాగ్రత్త — అవగాహనే రక్షణ” అని పోలీసు అధికారి అన్నారు.

