మత్స్యశాఖలో లంచాల రాజ్యం!అధికారులపై మత్స్యకారుల ఆగ్రహం
(నమస్తే న్యూస్ బ్యూరో - నల్గొండ/వరంగల్, అక్టోబరు 18)
మత్స్యశాఖలో లంచం లేకుండా ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. చిన్న పని చేసుకోవాలన్నా... పెద్ద ఫైలు ముంచుకోవాలన్నా... ‘డబ్బు... డబ్బు... లంచం...’ అనే మాటలే వినిపిస్తున్నాయి. సంఘ సభ్యత్వం కోసం ఎంత ఇస్తావు? సహకార సంఘం రిజిస్ట్రేషన్‌కి ఎంత ఇస్తావు? చెరువు లీజుకు ఎంత ఇస్తావు? చనిపోయిన మత్స్యకారుడి ఇన్సురెన్స్ ఫైలు పంపాలన్నా ఎంత ఇస్తావు? — ఇవి మత్స్యశాఖలో ప్రతిదినం వినిపించే ప్రశ్నలుగా మారాయి.నిన్న నల్గొండ శాఖాధికారి… నేడు వరంగల్ అధికారి లంచాల వ్యవహారంలో వార్తల్లో నిలవడం, ఈ శాఖలోని అవినీతికి నిదర్శనం. మత్స్యకారుల సంక్షేమానికి ఏర్పడిన శాఖే, వారి రక్తం పీల్చే శాఖగా మారిందని మత్స్యకార సంఘాలు ఆరోపిస్తున్నాయి.జేఏసీ మాజీ సభ్యుడు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ –
“రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో కొద్దిమంది మినహా, మత్స్యశాఖ అధికారులందరూ లంచం లేకుండా పని చేయడం లేదు. డబ్బు ఇస్తేనే ఫైళ్లు కదులుతున్నాయి. ఉన్నతాధికారులకు ఈ అంశంపై పలు మార్లు తెలియజేశాను. కానీ మార్పు కనిపించడం లేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న అవినీతి దృష్టాంతాలను వివరించిన ఆయన, “మత్స్యశాఖ మత్స్యకారుల సంక్షేమం కోసం కాదు, డబ్బు రాబడేందుకు రూపొందిన శాఖలా మారింది,” అని మండిపడ్డారు.ఇటీవల మహబూబాబాద్‌ను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో కూడా మత్స్యశాఖ పనితీరు ప్రస్తావన వచ్చిందని ఆయన చెప్పారు. “అధికారులు లంచాల పద్ధతిని మార్చుకొని నిజమైన సంక్షేమం వైపు పయనించాలి,” అని గొడుగు శ్రీనివాస్ కోరారు.

