నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
నిజాం నిరంకుశత్వంపై ఎత్తిన అక్షర కరవాలం షోయబుల్లాఖాన్ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు శంతన్ రామరాజు అన్నాడు.
షోయబుల్లాఖాన్ వర్ధంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించాడు. TSJU జిల్లా అధ్యక్షుడు చిర్రగోని ఉదయ్ ధీర్ అధ్యక్షతన TUWJ(143) పట్టణాధ్యక్షులు బొల్లెపల్లి రామకృష్ణా రెడ్డి నిర్వహించిన ఈకార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వంపై తన కలంతో అగ్నిధార కురిపించిన అక్షర సేనాని షోయబుల్లాఖాన్ అని కొనియాడాడు. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని త్యాగదనుడు, భయమెరుగని పాత్రికేయుడని పేర్కొన్నాడు. 1920, అక్టోబర్ 17న. ఖమ్మం జిల్లా సుబ్రవేడులో షోయబ్ జన్మించాడన్నాడు. ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణకు వలసవచ్చిన షోయబ్ తండ్రి రైల్వే ఉద్యోగిగా స్థిరపడ్డాడని అన్నాడు. షోయబ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజం పట్టా తీసుకొని తాజ్వి పత్రికద్వారా నాటి నిజాం నిరంకుశత్వాన్ని, ఖాసీం రజ్వీ దురాగతాలను ఎండగట్టాడాని అన్నాడు. ప్రభుత్వం ఆపత్రికను నిషేదించడంతో ఇమ్రోజు పత్రికద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను, పాలకుల లోపాలను ఎత్తి చూపుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి .మద్దతుగా నిలిచాడన్నాడు. నిర్భయుడిగా, మొండివాడుగా, నిస్వార్థంగా తాను నిర్దేశించుకున్న లక్ష్యంకోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా షోయబుల్లాఖాన్ పేరు తెచ్చుకున్నాడన్నాడు. పాకిస్థాన్ కు దన సహాయంతో పాటు తెలంగాణను విలీనం చేసే కుట్రలను నాటి ప్రభుత్వంలోని ఏడుగురు పెద్దలు లేఖల ద్వారా బయటి ప్రపంచానికి తెలియబర్చడంతో ఆలేఖలను యధాతథంగా షోయబుల్లాఖాన్ తన పత్రికలో ప్రచురించాడన్నాడు. ఈవిషయాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకుపోతుందనే భయంతో షోయబుల్లాఖాన్ పై నిజాం సర్కార్ కక్ష కట్టిందన్నాడు. పత్రిక విధులు ముగించుకొని రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న షోయబుల్లాఖాన్ హత్యకు గురవడం విచారకరమన్నాడు. చేతులు నరికి అత్యంత పాశవికంగా హత్యగావించిన తీరు షోయబుల్లాఖాన్ నిజాయితీని, సమాజంపట్ల తన నిబద్ధతను తెలియజేస్తోందని శ్లాఘించాడు. కుల, మత, ప్రాంత, భాషా విభేదాలతో అట్టుడుగుతున్న నేటి సమాజానికి షోయబుల్లాఖాన్ లాంటి జాతీయవాద పాత్రికేయుడు అవసరం అని అన్నాడు. ఏదేమైనా ఆయన బలిదానం, పోరాట స్ఫూర్తి సూర్య చంద్రులున్నంత వరకూ పాత్రికేయ ప్రపంచంలో విరాజిల్లుతూనే వుంటాయని అన్నాడు.ఇంతటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ముందుతరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలన్నాడు. ఆ మహనీయుని పేరిట అవార్డులు అందించి ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని నెలకొల్పి పత్రికాప్రపంచానికి నూతనోత్సాహాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేసాడు. మన మహబూబాబాద్ లో ఆయన పేరుమీద ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని అన్నాడు.
నేటి పత్రికా రంగానికి షోయబుల్లాఖాన్ జీవిత చరిత్ర కరదీపిక అని అన్నాడు.
ఇంకా ఈకార్యక్రమంలో కమ్మగాని కృష్ణమూర్తి, సిరిపురం వీరన్న, రామరాజు ఉపేందర్, గంగాదరి బాలరాజు, వన ప్రేమికుడు ధైద వెంకన్న, ధరంసోత్ నారాయణ్ సింగ్ తో పాటు పాత్రికేయులు వర్మ, కుమార్, గుండెల రాజు, గాండ్ల కిరణ్, లక్ష్మణ్, అంబాల కుమార్, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, రాచకొండ ప్రవీణ్, యాకన్న, సురేష్, కొండి సాయికిరణ్ నేత, గోనె శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

