◆అభ్యాస్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య – బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్.
(నమస్తే మానుకోట న్యూస్,తొర్రూర్, జూలై 29)
తొర్రూర్ మండలంలోని అభ్యాస్ స్కూల్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఘటనపై విద్యార్థి సంఘం ఎస్.ఎఫ్.ఐ తీవ్రంగా స్పందించింది. మృత విద్యార్థి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో అభ్యాస్ స్కూల్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ తొర్రూర్ మండల అధ్యక్షుడు కళ్యాణి ఆకాష్ మాట్లాడుతూ, “ఘటనపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన పరిస్థితులను బహిర్గతం చేయాలని, విద్యార్థి కుటుంబానికి ఆర్థికంగా సాయంగా రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై స్కూల్ మేనేజ్‌మెంట్ అశ్రద్ధ, ఒత్తిడి వ్యవహారాలే ఈ దురదృష్టకర ఘటనకు దారితీశాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షుడు మహేష్, నాయకులు సందీప్, వంశీ, ప్రవీణ్, యాకన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఈ ఘటనపై తీవ్ర చర్చ సాగుతోంది. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది.

