(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
కుటుంబ కలహాలతో ఏర్పడిన ఓ ఘర్షనలో భార్యనుండి,భర్త లాక్కున్న బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు అదే తండాకు చెందిన ఇద్దరు యువకులు. ఓవైపు తోటి వ్యక్తి కుటుంబ సమస్యల్లో ఉండగా అండగా నిలవాల్సింది పోయి..ఇంటికి కన్నం వేశారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగుడెం గ్రామ శివారు చారి తండాకు చెందిన జాటోత్ సురేష్ ,సునీత భార్యాభర్తలు. వారి మధ్య కుటుంబ తగాదాలు జరగడంతో భార్య సునీత పుట్టింటికి వెళ్ళింది.ఈ క్రమంలో భర్త సురేష్ భార్య ఒంటిపై ఉన్న పుస్తెలతాడు మరియు చైన్ తీసుకుని ఇంట్లో బీరువాలో పెట్టాడు. ఈనెల 1వ తేదీన భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్ళాడు. భార్య తన పుస్తెలతాడు, చైన్ తీసుకునివస్తేనే ,భర్త వెంట వస్తానని చెప్పడంతో తండాకు వచ్చి ఇంట్లోని బీరువాలో చూడగా బంగారు ఆభరణాలు కనపడలేదు .దీంతో కంగుతిన్న భర్త సురేష్ ,తన భార్య సునీత తో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇంటి పక్కన గల జాటోత్ ప్రవీణ్ ,జాటోత్ నవీన్ లను విచారించగా తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిపై దొంగతనం కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

