అంబేద్కర్ అందరివాడు
-జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసింహస్వామి
(నమస్తే మానుకోట-మహబూబాబాద్ కలెక్టరేట్)
బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కొందరికో సంబంధించిన వ్యక్తి కాదని, ప్రపంచంలోని అందరికీ చెందిన వాడని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ,ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వార్థపరులు తమ సుఖం కోసమే జీవిస్తారని, సామాన్యులు తమ కుటుంబ సంక్షేమం కోసమే మనుగడ సాగిస్తారని, మహనీయులు మాత్రం సమాజ కళ్యాణం కోసం తమ జీవితాన్ని అర్పిస్తారన్నారు. అట్టి మాన నీయులైన మహనీయుల జీవిత చరిత్రలు సామాన్యులకు, ముఖ్యంగా యువతి, యువకులకు మార్గదర్శకాలని, ఈ ప్రపంచానికి మానవత సుగందాలు పంచిన జ్ఞాన సూర్యుడైన గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బాల్య దశలోనే చదివి ఆయనను ఆదర్శంగా స్వీకరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మేటి మానవతా మూర్తిగా మరియు విజ్ఞాన జ్యోతిగా, భాషకందని త్యాగశీలిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ,భారత రాజ్యాంగ నిర్మాతగా, భారతరత్నగా ప్రపంచంలోనే మొదటి మేటి మేధావిగా బోధిసత్వనిగా, నవబుద్ధునిగా వెలుగొంది ఎందరికో ఆదర్శ ప్రాయుడు అయినాడని అన్నారు.ప్రముఖ సామాజికవేత్త, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క దళితుల లేదా భారత పీడిత ప్రజల విమోచకుడే కాదు ఆయన ఆఫ్రికా ఖండంలోని వివిధ నల్లజాతీయులకు, అమెరికాలోని ఆఫ్రో అమెరికన్లకు, ఐ రూప దేశాలలోని రోమాలకు జపాన్ లోని బురాకుమిన్ లకు ఒక స్ఫూర్తి ప్రదాత మరియు వైతాళికుడు. భారతదేశంలోని దళితుల వలెనే ఈ ప్రాంతాలలో వివక్షతకు గురి అవుతున్న నల్లజాతి ప్రజలు డాక్టర్ అంబేద్కర్ ఆదర్శ జీవితాన్ని మరియు అనితర సాధ్యమైన ఆయన ఉద్యమ చరిత్రను అధ్యయనం చేస్తున్నారనీ,ఆయన ఆలోచన విధానమే వారి ప్రగతికి సుగతికి మార్గదర్శకమని నమ్మి ముందుకు సాగుతున్నారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, వ్యాసరచన పోటీల సమన్వయకర్త వెనగంటి శుభ, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ లతో పాటు జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


