ఐకెపి సెంటర్లపై దళారుల కన్ను.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులే టార్గెట్.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా..చోద్యం చూస్తున్న అధికారులు
గ్రామాల్లో అమాయక రైతుల పాసుబుక్కులపై జీరో దందా..!
మార్కెటింగ్ శాఖకు చెల్లించాల్సిన సెన్సును ఎగవేస్తూ,ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న దళారులు.
అక్రమ షెడ్లు,కార్యాలయాలు,గోదాముల నిర్వహణ.
ఆపదలో ఉన్న రైతులకు అప్పటికప్పుడు కొంత ముట్టజెప్పి, ప్రభుత్వ నిర్ణయించిన ధరల కన్నా తక్కువ పై కొనుగోలు.
అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న రైతు సంఘాలు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
రైతును రాజు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, అక్రమ వ్యాపారుల ముందు బేజారవుతుంది. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ప్రజా పాలనలో ప్రజల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది దీనిలో భాగంగా వరి ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించి తమ చిత్తశుద్ధిని చాటుకుంది. కాగా క్షేత్రస్థాయిలో ఐక్యత సెంటర్లలో రైతులు ధాన్యం అమ్ముకోవాల్సి ఉండగా ఓవైపు ఆర్థిక బాధలు మరోవైపు వర్ష భయం తో కొనుగోలు ఆలస్యం అవ్వడం, ధాన్యం కాంటాలు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ కు పంగనామం పెడుతూ , తూకంలో మాయాజాలం, ధరలలో కోతలు విధిస్తూ రైతులను దోచేస్తున్నారు.రాత్రింబవళ్లు కష్టపడి వంట సాగు చేసిన రైతులకంటే... దళారులకు కాలు కదపకుండా ఉన్నచోటే కాసుల పంట పండుతుంది. రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతుండగా... దళారులు, వ్యాపారులు కోట్లు ఆర్జిస్తున్నారు. తీసుకెళ్లిన సరుకులు వెనక్కి తీసుకు రాలేక వచ్చిన ధరకు అమ్మడం తప్ప గత్యంతరం లేని దుస్థితి ఉంది. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకొని రైతులను నిండా ముంచుతున్నారు.
గ్రీన్ మార్కెట్ బడా మోసం.
మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన మామిడికాయల్లో 80 శాతం మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ దళారుల షెడ్డు కు తరలిస్తారు. అక్కడ దళారులు చెప్పిందే వేదం. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే సరుకులు ఇతర రాష్ట్రాలకు అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మామిడి రైతులు దోపిడికి గురవుతుండగా దళారులు,వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. ధరల మాయజాలంలో మామిడి రైతులు యేటా నష్టపోతూనే ఉన్నారు.
కన్నీటిని మిగుల్చుతున్న పత్తి.
పత్తి పండించిన రైతులు యేటా నష్టాలే మూటగట్టుకుంటున్నారు.దళారులు గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ పెచ్చు,తరుగు పేరిట ఒకటి నుండి రెండు కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. నగదు డబ్బు కావాలంటే 15 శాతం కటింగ్ తో చెల్లిస్తున్నారు.నెలరోజుల ఉద్దెరతో బేరం సాగిస్తున్నారు.ధరలు పెరుగుతాయని ముందుగానే పసిగట్టే దళారులు రైతులు నుంచి పత్తి కొనుగోలు చేసి మిల్లులో నిలువ చేసి ధరలు పెరిగిన తర్వాత విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రైవేటు వ్యాపారులకు ,కాసులు కురిపిస్తున్న ధాన్యం.
ధాన్యంతో యేటా మిల్లర్ల పంట పండుతోంది.పెట్టుబడులు కోసం చేసిన అప్పుల బాధతో రైతులు వచ్చిన ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. దళారులు నగదు పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని,పెరిగిన ధరలతో లాభ పడుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సైతం రైతుల వద్ద ధాన్యాన్ని కొని అదే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించి లాభపడుతున్నారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తున్న దళారులు.చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.
నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు, అడ్డాలుగా సొంత కార్యాలయాలు.
మార్కెటింగ్ శాఖకు చెల్లించాల్సిన సెన్సును ఎగవేస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ,జీరో దందాలకు అలవాటు పడిన దళారులు ఏకంగా షెడ్లు, కార్యాలయాలు తెరిచి,తూకంలో సైతం మోసాలకు పాల్పడుతూ కొనుగోలు చేస్తున్న తీరును రైతు సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. దళారులు వ్యాపారులు ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (ఈ - నామ్) అందుబాటులోకి రాలేదు.దళారుల,వ్యాపారుల ఆగడాలను కట్టడం చేయాల్సిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని అక్రమంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మామిడి,వరి,పత్తి,మిర్చి లాంటి పంటలను రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని కొంటూ, రైతన్నలను ముంచుతున్న దళారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో,దళారులతో అధికారులకు చీకటి ఒప్పందాలు ఉన్నాయని మండల రైతు కూలీ సంఘం నాయకులు,రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.





