(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట స్ఫూర్తితో స్త్రీ-పురుష సమానత్వానికై ఉద్యమించాలని పి.ఓ.డబ్ల్యూ నరసింహులపేట మండల కార్యదర్శి కామ్రేడ్ చిర్ర యాకమ్మ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ యాకమ్మ మాట్లాడుతూ నాడు మహిళలు లారీ జెట్కిన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించి మహిళల హక్కులను సాధించుకోవడం జరిగిందని అన్నారు. నేడు మహిళలను వంటింటి గృహిణిగా, ఆట బొమ్మలుగా మార్చేసి పురుషాహంకారంతో వంటింటికి పరిమితం చేయాలని పురుషాధిపత్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, అణిచివేత కొనసాగుతూనే ఉందని మహిళలపై దాడులు,అత్యాచారాలు చిన్న పిల్లలపై సైతం అత్యాచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పోరాట స్ఫూర్తితో స్త్రీ,పురుష సమానత్వం పై ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు భద్రమ్మ, ముత్తమ్మ ,ఉపేంద్ర రాములమ్మ, ఎల్లమ్మ,సుశీల,రామతార,ఎంకమ్మ, సుభద్ర సోమమ్మ ,ఉప్పలమ్మ, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

