Type Here to Get Search Results !

ఆ..అర్హత బిఆరెస్ కు లేదు-బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు.

 ◆బిఆరెస్ బడ్జెట్లన్నీ డూప్లికేట్ బడ్జెట్లే.

◆సకలజనుల సంక్షేమానికి అద్దం పట్టిన ప్రస్తుత బడ్జెట్.

◆పదేళ్ల విధ్వంస పునాదులపై మొదలైన తెలంగాణ పునర్నిర్మాణం.

◆ఏ బడ్జెట్లో అయినా బాగుపడ్డది కేసీఆర్ కుటుంబమే.

◆కేసీఆర్ అండ్ టీం ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలి.

◆అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్న కాంగ్రెస్.


(ఫోటో రైటప్:సమావేశంలో మాట్లాడుతున్న శంతన్ రామరాజు)

(నమస్తే మానుకోట-మహబూబాబాద్):రాష్ర్ట  బడ్జెట్ ను విమర్శించే అర్హత బిఆరెస్ నేతలకు లేదని మానుకోట జిల్లా కాంగ్రెస్ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అన్నారు.ఆదివారం మానుకోట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ పదేళ్ళుగా ప్రజల హక్కులను పాతరేస్తూ సాగిన విధ్వంసపు పునాదుల మీద ప్రజా తెలంగాణను నిర్మించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అధికారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బీఆరెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ పై విషం చిమ్ముతున్నారని మండి పడ్డారు. బీఆరెస్ కు తెలిసింది దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే అని పదేళ్లుగా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా అంచున నిలిపారని ఆగ్రహం వెళ్లగక్కారు. మిగులు బడ్జెట్తో మొదలైన తెలంగాణ ప్రస్థానం అప్పులు కుంపటిగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు లక్షల డెబ్భైఐదు వేల కోట్ల పారదర్శక బడ్జెట్ను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందన్నారు. గతంలో బీఆరెస్ తెచ్చిన బడ్జెట్లన్నీ పక్కా డూప్లికేట్ బడ్జెట్లే అని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టిగానే ఆరు గ్యారంటీల అమలు కోసం సింహభాగం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. రైతులు, ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు వెచ్చించి బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని కొనియాడారు. బీఆరెస్ పాలనలో పాఠశాల భవనాల పాకురు పట్టిన గోడలకు సున్నం వేసే పరిస్థితి లేదన్నారు. అలాంటిది ఈ బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వెయ్యడమే కాకుండా గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

వైద్య రంగం, వ్యవసాయ రంగానికి సైతం అధిక నిధులు కేటాయించారన్నారు. గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. బీఆరెస్ చేసిన ఎనభై వేల కోట్ల కరెంట్ అప్పులు వున్నా ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం నిధులు వెచ్చించడం కేసీఆర్ అండ్ టీమ్ కు చెంపదెబ్బ లాంటిదని అభివర్ణించారు. గతప్రభుత్వం ఊరికి ఒకరిద్దరు దళితబంధు, బీసీ బంధు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. యువనేత మానుకోట ఎమ్మెల్యే డా.బీ. మురళీ నాయక్ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా వారి ఎదుగుదలలో ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. అన్ని మౌళికవసతుల కల్పనకు కసరత్తు చేస్తున్నారన్నారు.   ఏదేమైనా రాష్ట్రాన్ని మద్యం డబ్బులతో, అవినీతితో నడిపిన బీఆరెస్ పార్టీకి ముందుముందు అసలు సిసలు సిన్మా కనిపిస్తుందని అన్నారు. వచ్చే పట్టభద్రుల, పార్లమెంట్ ఎన్నికల్లో  లేని తమ ఉనికిని చాటుకునేందుకు బీఆరెస్ పార్టీ ప్రజల్ని బురిడీ కొట్టించే కుట్రలకు పాల్పడుతోందని అన్నారు.

కేసిఆర్ బ్యాచ్ ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా బీఆరెస్ నేతలు, బానిసలు నోర్లు అదుపులో పెట్టుకోవాలని, ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే అడ్డమైన పనికిమాలిన పనులు మానుకోవాలని హితబోధ చేశారు. లేదు ఇలాగే తప్పుడు మాటలు మాట్లాడుతాం అంటే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని బీఆరెస్ నేతలుకు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఇంకా ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామిశెట్టి ఉప్పలయ్య, యువ నాయకులు ఆల్వాల లాలయ్య, షఫీ, వినోద్, విజయ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.