నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
బీఆరెస్ పాలనలో ధ్వంసమైన విద్యావ్యవస్థను పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గురువారంనాడు జిల్లా కేంద్రంలోని ప్రాధమిక పాఠశాలల దుస్థితి పరిశీలించి ఆవేదన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ వ్యవస్థ అభివృద్ధికి వెన్నుముక అయిన విద్యావ్యవస్థ పదేళ్ల బీఆరెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య అనేది మనిషి ఎదుగుదలకు మొదటిమెట్టు లాంటిదన్నారు. ఈవిషయాన్ని విస్మరించిన గత ప్రభుత్వం కొత్త పాఠశాలను నిర్మించకపోగా విద్యార్థులు తక్కువున్నారనే కారణంతో వందలాది స్కూళ్లను మూసేసి పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వెళ్లగక్కారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన స్కూళ్లకు కనీసం రంగులు వెయ్యలేని దుస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. మౌళికవసతుల కల్పన లేమితో కొన్ని స్కూళ్ళు బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయన్నారు. చాలావరకు శిథిలావస్థకు చేరిన భవనాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడంతో పాటు చదువుకోవడాని ఆహ్లాదకరమైన వాతావరణమే కరువైందని వాపోయారు. కోవిడ్ దెబ్బతో ఆర్థికంగా కుదేలైన ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించాయన్నారు. విద్యా వైద్యం అనేవి ప్రజల ప్రాథమిక హక్కు అని వీటిని గత ప్రభుత్వాలు వ్యాపార రంగాలుగా మార్చాయని అన్నారు. దీంతో విద్య వైద్యం చాలా ఖరీదుగా మరాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని తండాలు, గూడాలల్ల ఉన్న ప్రైమరీ స్కూళ్ళు ఇంకా దయనీయ పరిస్థితిలో ఉన్నాయన్నారు. అంగన్వాడీ సెంటర్లను స్కూళ్లను ఒకే కాంప్లెక్స్ లో ఏర్పాటు చెయ్యాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకోవాలన్నారు. పిల్లలకు నాణ్యమైన స్కూల్ డ్రెస్సులు, బూట్లు సకాలంలో అందించి ప్రైవేటు స్కూళ్లకు దీటుగా పటిష్ట పరచాలన్నారు. ఇంకొంచం ముందుకెళ్లి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి 1 నుండి 7వ. తరగతి వరకు ప్రైవేటు లేకుండా ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించి విద్యనందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం వేలకోట్లు విద్యావ్యవస్థ మీద ఖర్చు పెట్టినట్లు కాకిలెక్కలు చూపెట్టిందని ఎద్దేవాచేశారు. కులాలు, మతాల వారిగా ప్రభుత్వం విద్యా వ్యవస్థలు నిర్వహించడం సమాజానికి అంత మంచిది కాదని అన్నారు. సమాజంలోని ప్రతి కుటుంబం తమ జీవితంలో విద్య వైద్యానికే ఎక్కువ ఖర్చు పెడుతాయని ఆరెండింటిని అన్నివర్గాలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదన్నారు. తద్వారా చదువుకున్న ఆరోగ్య భావిభారతం ఆవిష్కృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈదిశగా ఆలోచించి ప్రాధమిక విద్య పటిష్టత కోసం ఓ కమిటీ వేసి బాలరిస్టాల్లో ఉన్న బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పింద్రాల రాందాసు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

.jpg)