నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ శాఖల కార్యకలాపాలను సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ముందుగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యకలాపాల పనితీరును ప్రశ్నించగా, తమ శాఖ పరిధిలో రెండు ప్రధాన విభాగాలైన మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు సెర్ప్ విభాగాలు పనిచేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో 16 మండలాల్లో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 45 లక్షల కూలి పనులకు గాను 46 లక్షల కూలీ పనులు జరిగినట్లు 102.52 శాతంతో ప్రగతి సాధించామన్నారు. 99 శాతం పేమెంట్ అందించగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామని డిఆర్డిఏ పిడి కలెక్టర్కు వివరించారు.
ప్రస్తుతం చేపట్ట బోయే సీసీ రోడ్లకు సైడ్ డ్రైన్స్ చేపట్టాలని ఉన్నతాధికారులు తెలియజేశారన్నారు.
మన ఊరు మన బడి కార్యక్రమం కింద 316 పనులు 5 శాఖల ద్వారా చేపట్టామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలు పరిరక్షించేందుకుగాను చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు 702 నిర్మాణాలు జరిగినట్లు వివరించారు. అదేవిధంగా బృహత్ పల్లె ప్రకృతి వనాలలో భాగంగా 80 కి 39 మంజూరు చేయబడ్డాయని 15 ప్రగతిలో ఉన్నాయన్నారు.
461 గ్రామపంచాయతీలలో నర్సరీలు నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాలుగా జిల్లాలోని రహదారులకు ఇరువైపులా మల్టీ లేయర్లుగా మొక్కల పెంపకం చేపట్టినట్టుగా కలెక్టర్కు వివరించారు.
స్వచ్ఛ సర్వేక్షన్ క్రింద బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామం ఎంపికైనదని 100% మరుగుదొడ్ల నిర్మాణం, సోక్ పిట్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మితమయ్యాయి అన్నారు.
సీఎం గిరి వికాస పథకం కింద మారుమూల ప్రాంతాల మండలాలలోని భూములకు నీటి సౌకర్యం కల్పించే దిశగా 356 యూనిట్లు మంజూరు కాగా 321 డ్రిల్ చేశామని 186 పూర్తి అయినట్లు తెలిపారు. ఒక్కొక్క యూనిట్ కింద మూడు లేక నాలుగు కుటుంబాలు ఉపాధి పొందుతున్నట్లు తెలియజేశారు.
జిల్లాలో 16 జిల్లా సమాఖ్యల క్రింద 681 విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని, 15 వేల స్వయం సహాయక గ్రూపులలో 1.60 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు తెలియజేశారు.
100% బ్యాంకు రుణాలు పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో ఐదు వేల మంది పలు ఎంటర్ప్రైజెస్ క్రింద కూరగాయల విక్రయ దుకాణాలు, చికెన్ సెంటర్స్, ఫ్లోర్ మిల్స్, క్లాత్ సెంటర్స్ వంటి వి ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ సాధికారిక దిశగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఆసరా పెన్షన్ల క్రింద ప్రతి నెల 27 కోట్లు చెల్లించడం జరుగుతుందన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, పైలేరియా, నేత కార్మికుల కు 2016 రూపాయలు చొప్పున, దివ్యాంగులకు 4016 రూపాయలు చొప్పున పెన్షన్లు అందజేయడం జరుగుతున్నదన్నారు.
సదరన్ క్యాంపులు ప్రతినెలలో ఒకసారి స్లాట్ బుకింగ్ లతో బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వైద్యుల సహకారంతో నిర్వహిస్తున్నామని, అర్హులకు దృవీకరణ పత్రాలను అందజేస్తున్నట్లు తెలియజేశారు.
ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెట్ మిషన్ కింద స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలను చేపట్టవలసి ఉందన్నారు.
జిల్లాలోని కేసముద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఉపాధి హామీలో ఫైనాన్షియల్ ఇయర్ లో 100% కూలీ పనులు ఉపయోగించుకున్న కుటుంబంలో ఒకరికి ఉచితంగా సౌకర్యాలు కల్పించి శిక్షణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలియజేశారు.
అనంతరం జిల్లా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను సంబంధిత అధికారు లను అడిగి తెలుసుకున్నారు. స్టాండింగ్ కమిటీల ద్వారా జనరల్ బాడీ సమావేశాల ద్వారా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనులను చేపట్టి ప్రగతి సాధిస్తున్నామన్నారు .
బలపాల, సీరోలు పిహెచ్సిలకు నిధులు మంజూరు చేయబడ్డాయని బలపాల పిఎస్సి నిర్మాణం కొనసాగుతుండగా సీరోలు పి.హెచ్.సి టెండర్ దశలో ఉందని వివరించారు. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ వంటి మరమ్మత్తుల పనులను చేపడుతున్నామన్నారు452 మంది పంచాయతీ సెక్రటరీలు, 458 సర్పంచులతో నీటి సౌకర్యాలు, విద్యుత్తు సౌకర్యాలు చేపడుతున్నామన్నారు. ఏడు కోట్ల లక్ష్యంతో నాలుగు కోట్లు పైగా పన్ను వసూలు చేసి 60 శాతం గా ఉందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెట్ మిషన్ కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కార్యక్రమాలపై నైపుణ్యత పెంచే దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి సన్యాసయ్య, డిప్యూటీ సీఈఓ నర్మద, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


