ప్రజా ప్రతినిధుల ప్రమేయం తొలగించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు.
ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
సామాజిక వివక్ష, అణచివేతకు గురవుతున్న దళితుల సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాల్లో ఆర్థిక సాధికారతను తీసుకువచ్చేందుకు సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ ఉపఎన్నికలకు ముందు తీసుకువచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఒక్కో నిరుపేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. దళితులను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు దళిత బంధు ఉపయోగపడుతోందని ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన వారు ఎంట్రప్రెన్యూర్లుగా మారారు.
ఈ పథకం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకంగా రికార్డుల్లోకి ఎక్కింది.
మొదట ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించాలని అనుకున్నా.. రాజకీయ విమర్శల వల్ల 2021లో యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామం నుంచి నేరుగా ప్రారంభించారు. కానీ అసలైన దళిత బంధు పథకాన్ని మాత్రం హుజురాబాద్ ఉపఎన్నికల సందర్భంగా 2021 ఆగస్టు 16న కరీంనగర్ జిల్లాలోని శాలపల్లిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ఈ పథకం తొలి విడతలో 35 వేల మంది దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీంతో ఈసారి రెండోవిడత సాయానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ దఫా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఎస్సీ సంక్షేమ శాఖ ఆదేశించింది. రెండో విడత దళిత బంధుకు రూ.17,700 కోట్లను కేటాయించారు. ఈసారి దళిత బంధు ఎంపికలో ప్రజా ప్రతినిధులు ఎవరిని ఎంపిక చేస్తారో వారినే.. ఇందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
కానీ నేడు ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేశారు. ఇందుకు సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
