అక్షర యోధుడు షోయాబుల్లాఖాన్ ఆశయ సాధనకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కృషిచేయాలని టియూడబ్ల్యూజె(ఐజెయూ) ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షులు చిమ్ముల సాయిరెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సోమవారం నర్సింహులపేట మండల కేంద్రంలో షోయాబుల్లాఖాన్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి మాట్లాడుతూ అక్షరాన్ని అగ్నికణంగా మలిచి హైదరాబాద్ సంస్థానంలోని దొరలు, దేశ్ ముఖ్ లు, రజాకార్లు సాగిస్తున ఆగడాలను, నిజాం నియంత్రృత్వ పరిపాలనను సవాల్ చేస్తూ నిప్పుకణివంటి అక్షరాలతో నిజాం గుండెల్లో దడపుట్టించిన అక్షరవీరుడు షోయబ్ ఉల్లా ఖాన్. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమ, స్వాతంత్ర్య సమరచరిత్రలో ప్రముఖపాత్ర పోషించిన షోయబ్, నిజాం ప్రభుత్వం పత్రికలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న రోజుల్లోనే ప్రభుత్వ దమనకాండలకి వ్యతిరేకంగా 1947 నవంబర్ 15వ తేదీ న "ఇమ్రోజ్ " పత్రిక ను స్థాపించి నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలను, రజాకర్ల అకృత్యాలను ఎండగట్టారని అన్నారు.హబీబుల్లా ఖాన్, లాయహున్నీషా బేగం దంపతుల సంతానమైన షోయబ్ ఉల్లా ఖాన్ 1920 అక్టోబర్ 17న ఖమ్మం జిల్లా సుబ్లేడులో జన్మించాడని , హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉన్నత ఉద్యోగావకాశాలు ఉన్నా వదిలేసి అతి తక్కువ ఉపాధి వేతనం కల జర్నలిజాన్ని ఎంచుకొని సమాజం పట్ల తన కున్న బాధ్యతను చాటుకున్నారని అన్నారు.
ఇమ్రోజ్ పత్రిక నిజాం ప్రభుత్వానికి, రజాకార్లకి వ్యతిరేక గొంతుకగా మారండతో ప్రజల్లో మతాలకతీతంగా చైతన్యం రావడం సహించని ఖాసిం రజ్వీ 1948 ఆగస్టు 19న హైదరాబాద్ లో జరిగిన ఒక సభలో నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారి చేతులు నరికేస్తామని, పత్రికలను సర్వనాశనం చేస్తామని బహిరంగంగానే బెదిరించిన, ఇటువంటి బెదిరింపులకు షోయబ్ ఏ మాత్రం బెదరక ,తన రచనలలో పదును కూడా తగ్గించలేదు. ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా వ్రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మతదురహంకారులు అయిన రజ్వీ అనుయాయులు తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్న సమయంలో 1948, ఆగస్టు 21వ తేదీన అర్ధరాత్రి వరకు కాచిగూడ చౌరస్తాలోని ఇమ్రోజ్ పత్రికా కార్యాలయంలో మరుసటి రోజు పత్రికలో అచ్చువేయడం కొరకు “నేటి భావాలు” అనే శీర్షికతో వ్యాసాన్ని పూర్తిచేసి ఇంటికి బయల్దేరిన షోయబ్ ఉల్లా ఖాన్ మరియు అతడి బావమరిది ఇస్మాయిల్ ఖాన్లపై చప్పల్ బజార్ కూడలి వద్ద ఖాసీంరజ్వీ అతని అనుచరులు తుపాకులతో కాల్పులు జరపగా షోయబ్ నేలకొరిగాడని అన్నారు. సమాజంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఐక్యంగా ఎదుర్కొని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు చౌడవరపు శ్రీనివాస్,కొండబత్తిని రవి,రేఖ ఉపేందర్,కోల యాకన్న ,నిమ్మల నరేష్ ,కొమిరె యాకస్వామి ,చిదిమిల్ల గణేష్ ,కల్లెడ మధు,బొబ్బ రాజు ,ఎర్రనాగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
