పక్షవాతంతో మంచానికే పరిమితమైన భర్త ఎదుటే కిరాతకం.. నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు

తిరుమలాయపాలెం, జూలై 18 (నమస్తే న్యూస్): ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బంగారు ఆభరణాల కోసం ఇంట్లోకి చొరబడిన దుండగులు, ప్రతిఘటించిన వృద్ధురాలు చెన్నా సుగుణమ్మ (70)ను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆమె భర్త జనార్దన్ కళ్లెదుటే ఈ దారుణం చోటుచేసుకోవడం గ్రామస్తులను కలచివేసింది. చెన్నా సుగుణమ్మ–జనార్దన్ దంపతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆ విషాదం నుంచి వారు పూర్తిగా కోలుకోలేకపోయారు. చిన్న కుమారుడు తిరుమలరావు సత్తుపల్లి విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమవడంతో సుగుణమ్మే ఆయనకు సేవలందిస్తూ, ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్‌తోనే ఇద్దరి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్య దుండగులు ఇంట్లోకి చొరబడి, నిద్రలో ఉన్న సుగుణమ్మ మెడలోని బంగారు ఆభరణాలను లాక్కోవడానికి యత్నించారు. మెలకువ వచ్చిన సుగుణమ్మ ధైర్యంగా ప్రతిఘటించడంతో ఆగ్రహించిన దుండగులు ముందుగా ఆమె కళ్లలో కారం చల్లి, అనంతరం వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో తలపై బలంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటన మొత్తం పక్కనే మంచంపై ఉన్న భర్త జనార్దన్ కళ్లముందే జరిగింది. కదలలేని స్థితిలో ఉన్న ఆయన భార్యను కాపాడలేక నిస్సహాయంగా చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది.విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు తిరుమలరావు వెంటనే గ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.వృద్ధ దంపతుల పరిస్థితులు, సుగుణమ్మ వద్ద ఉన్న బంగారు నగల గురించి ముందుగానే తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తూ, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
