పాఠాలు చెప్పాల్సిన పంతులు.. ఫోన్ ముచ్చట్లలో మునిగి తేలుతున్నాడు!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేది ఎప్పుడు?
సంబంధిత అధికారులు స్పందించాలని తల్లిదండ్రుల డిమాండ్
నర్సింహులపేట, ఆగస్టు 22 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మూడవ తరగతి పాఠాలు బోధించాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఫోన్లో మాట్లాడుతూ సమయాన్ని గడుపుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరగతి గదిలో చిన్నారులు పాఠాల కోసం ఎదురు చూస్తుండగా, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఫోన్ సంభాషణల్లో నిమగ్నం కావడంపై తల్లిదండ్రులు, విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, అలాంటిది బోధనా సమయాన్ని ఫోన్ సంభాషణలకు వినియోగించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు పునాది బలంగా ఉండాల్సిన సమయంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వారి చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఫోన్లో మాట్లాడితే వారి చదువు పరిస్థితి ఏమిటి?” అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల పనితీరుపై విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, ప్రభుత్వ పాఠశాలలో బోధనా సమయాన్ని పూర్తిస్థాయిలో విద్యార్థులకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల చదువుతో చెలగాటమాడే నిర్లక్ష్య ధోరణికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో చూడాల్సి ఉంది.

