300 గజాల స్థలాన్ని విరాళంగా అందించిన ఉల్లి శ్రీనివాస్

నర్సింహులపేట, జూలై 18 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్ద నాగారం స్టేజి గ్రామపంచాయతీ పరిధిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శనివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ భూక్య సోనీ హరిలాల్, ఉప సర్పంచ్ రవి బాబు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం గ్రామానికి చెందిన ఉల్లి శ్రీనివాస్ 300 గజాల స్థలాన్ని విరాళంగా అందించడంతో భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది.ఈ సందర్భంగా ఆయన సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు. సర్పంచ్ భూక్య సోనీ హరిలాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం సహకారంతో ఆధునిక సౌకర్యాలతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ సుగుణాకర్, ఎంపీడీవో రాంప్రసాద్ రావు, ఎంపీఓ అశోక్, ఎస్టీ సెల్ నాయకులు దస్రు నాయక్, హరిలాల్, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, చప్పిడి వెంకట్ రెడ్డి, అనిల్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

