ఫైళ్ల పై శ్రద్ధ.. జాతీయ జెండాపై నిర్లక్ష్యమా?
నర్సింహులపేట ఎస్బీఐ నిర్వాహకుల తీరుపై విమర్శలు
జాతీయ పతాకాన్ని భద్రపరచడం పక్కన పడేశారు..?
నర్సింహులపేట, ఆగస్టు 25 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎగురవేసిన జాతీయ పతాకాన్ని వేడుకలు ముగిసిన అనంతరం తొలగించి, నిబంధనలకు అనుగుణంగా భద్రంగా ఉంచాల్సి ఉండగా, ఆ విషయంలో బ్యాంకు నిర్వాహకులు నిర్లక్ష్యం ప్రదర్శించారని స్థానికులు విమర్శిస్తున్నారు.బ్యాంకు వ్యవహారాలు, ఫైళ్లు, రికార్డుల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించే అధికారులు.. దేశ గౌరవానికి ప్రతీక అయిన జాతీయ జెండా విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జాతీయ పతాకం కేవలం ఒక వస్తువు కాదని, కోట్లాది భారతీయుల గౌరవం, దేశభక్తికి ప్రతీక అని పలువురు పేర్కొంటున్నారు.జాతీయ జెండా ఎగురవేయడం మాత్రమే కాదు.. దానిని గౌరవప్రదంగా నిర్వహించడం, వేడుకల అనంతరం నిబంధనలకు అనుగుణంగా భద్రపరచడం కూడా ప్రతి సంస్థ బాధ్యతేనని గుర్తు చేస్తున్నారు. ఇకనైనా ఎస్బీఐ బ్యాంకు నిర్వాహకులు స్పందించి జాతీయ పతాకాన్ని గౌరవప్రదంగా భద్రపరచడంతో పాటు, ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఫైళ్లపై ఉన్న శ్రద్ధ.. జాతీయ పతాకంపై లేదా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
