
మరిపెడ,జులై 17(నమస్తే న్యూస్).
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలందించి,బదిలీపై వెళ్తున్న వివిధ విభాగాల సిబ్బందికి మాతృ సంస్థలో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది.
వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భూక్యా రవి రాథోడ్,ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిబ్బందిని శాలువాలు,పూలమాలలతో అధికారులు,తోటి సిబ్బంది అత్యంత ఘనంగా సన్మానించారు.
అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ..బదిలీపై వెళ్తున్న సిబ్బంది ఇన్ని సంవత్సరాల పాటు వైద్య రంగంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్నో ప్రజారోగ్య కార్యక్రమాలను ఎంతో అంకితభావంతో విజయవంతం చేశారని కొనియాడారు.ప్రజారోగ్య పరిరక్షణలో దశాబ్దాల పాటు అలసిపోకుండా వారు అందించిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు.కొత్త ప్రాంతాలలో కూడా ఇదే ఉత్సాహంతో పని చేసి,ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.
బదిలీ అయిన సిబ్బంది వివరాలు:
సుదీర్ఘ కాలం సేవలందించి బదిలీ అయిన వారిలో బి.విజయకుమారి(32సంవత్సరాల సేవ),సిహెచ్.సరళ(31 సంవత్సరాలు),మోహినమ్మ(30 సంవత్సరాలు),వెంకటేశ్వర్లు(28 సంవత్సరాలు),చంద్రకళ(18సంవత్సరాలు),ఏ.బి.టి.సుందరి(18 సంవత్సరాలు),నర్సబాయి (18సంవత్సరాలు),ఆర్.పద్మ(16సంవత్సరాలు),ఫెరోజ్ (10 సంవత్సరాలు),సీనియర్ సహాయకుడు ఎస్.రవిచంద్ర(4 సంవత్సరాలు),మరియు సాయిశ్రీ(ఆరోగ్య సహాయకురాలు-4 సంవత్సరాలు)ఉన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఈ వీడ్కోలు వేడుకలో డాక్టర్ పూజిత,డాక్టర్ స్వామి,డాక్టర్ కిరణ్ సాగర్,ప్రాథమిక ఆరోగ్య నర్సు అధికారి మంగమ్మ,ఆరోగ్య పర్యవేక్షకులు ఆచార్యులు,మాధవి,లలిత కుమారిలతో పాటు గ్రామీణ ఆసుపత్రి సిబ్బంది,సహాయక నర్సులు,ఆశా ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బదిలీ అయిన వారికి ఆత్మీయ వీడ్కోలు పలికారు…
