
తిరుమలాయపాలెం,జూలై 16 (నమస్తే న్యూస్ )
మండలంలోని కేశవాపురం, కాకరవాయి, ఏలువారిగూడెం గ్రామాలలో ప్రత్యామ్నాయ పంటల సాగు, పంట కుంటల నిర్మాణంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీ నారెడ్డి సీతారామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాబట్టి రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు. జూలై నెలాఖరు వరకు పెసర, మినుము, కంది, జొన్న, ఆముదం వంటి పంటలను వేసుకునే వీలుందని ఆయన రైతులకు సూచించారు. ఒకవేళ జులై 31 వరకు సరైన వర్షాలు కురవని పక్షంలో.. కంది మరియు ఆముదం పంటలను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు.
100% సబ్సిడీతో పంట కుంటల నిర్మాణం:
భూగర్భ జలాలను పెంపొందించుకోవడం కోసం పంట కుంటల ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా ప్రభుత్వం 100% సబ్సిడీతో పంట కుంటలను నిర్మిస్తోందని తెలిపారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పొలాల్లో పంట కుంటలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్ పాలేరు నియోజకవర్గం ఆత్మ కమిటీ డైరెక్టర్ ఉప్పునూతల నాగేశ్వరరావు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) సాయికుమార్, సాధన, శ్రావణితో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
