అభ్యర్థులకు పొంతనలేని ప్రశ్నలు.. అధికారుల తీరుపై మహిళల ఆగ్రహం
కూర్చునేందుకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు.. కుటుంబ వివరాలు, పిల్లల చదువుపై ప్రశ్నలేమిటని నిలదీత

నర్సింహులపేట, జూలై 16 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన ప్రీ-ప్రైమరీ సెక్షన్లలో టీచర్లు, ఆయాల నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియామకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను ఎంఆర్సీ కార్యాలయంలో ప్రదర్శించి, ఇంటర్వ్యూలకు పిలిచిన అధికారులు అభ్యర్థుల అర్హతలకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని మహిళలు ఆరోపించారు.ఇంటర్వ్యూలో భాగంగా “మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు చదివిస్తున్నారు?” అంటూ అధికారులు ప్రశ్నించారని అభ్యర్థులు తెలిపారు. దీనికి ఓ అభ్యర్థి “ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు కదా.. మరి మమ్మల్ని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు?” అంటూ ఎదురుప్రశ్నించినట్లు సమాచారం.అంతేకాకుండా, ఉద్యోగానికి సంబంధం లేని కుటుంబ వివరాలను అడగడంపై కూడా మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇదేమి ఇంటర్వ్యూ.. అర్హతలు, బోధనా సామర్థ్యాన్ని పరీక్షించకుండా వ్యక్తిగత విషయాలు ఎందుకు అడుగుతున్నారు?” అంటూ పలువురు మహిళలు అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది.ఇక ఇంటర్వ్యూలకు హాజరైన మహిళలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు మహిళలు ఎంఆర్సీ కార్యాలయం ముందు నేలపై కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నియామక ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, అభ్యర్థులను గౌరవప్రదంగా చూడాలని మహిళలు డిమాండ్ చేశారు. అధికారుల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేసిన అభ్యర్థులు, ఇలాంటి ఇంటర్వ్యూ విధానం పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
