ప్యాండ్యతండా పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి.
అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్.

నర్సింహులపేట, జూలై 16 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ కే. అనిల్ కుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా మండలంలోని లోక్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని ప్యాండ్యతండా 21వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, బూత్ లెవల్ అధికారుల ద్వారా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించి, ఓటర్ల వివరాల నమోదు, ఇంటింటి సర్వే, అర్హుల గుర్తింపు తదితర అంశాలపై ఆరా తీశారు. సర్వే ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.అనంతరం నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించి అందుతున్న దరఖాస్తుల స్వీకరణ, ఫారాల నమోదు, అర్హుల వివరాల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలను సమీక్షించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ కే. అనిల్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ బాబు, ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ అధికారి పవన్ కుమార్, డీటీ సుధాకర్ నాయక్, ఆర్ ఐ శ్రవణ్ కుమార్, ఏ ఎస్ ఓ కిరణ్, బీఎల్ వో హరిత,పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

