ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.
సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య.

మరిపెడ,జులై 15(నమస్తే న్యూస్)
ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మరిపెడ మండలంలోని,గాలివారిగూడెం,అమృనాయక్ తండా గ్రామపంచాయతీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పార్టీ బృందం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలను బృందం దృష్టికి తీసుకువచ్చారు.
గాలివారిగూడెం ఉన్నత ప్రాథమిక పాఠశాలలో…
పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉన్నారు. నలుగురు ఉపాధ్యాయుల పోస్టులు మంజూరైనా,ఇద్దరిని వేరే పాఠశాలలకు పంపడంతో బోధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,వేరే పాఠశాలలకు పంపిన ఉపాధ్యాయులను వెనక్కి తెప్పించాలని వీరయ్య డిమాండ్ చేశారు.పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న పాత భవనం ప్రమాదకరంగా మారింది. అందులో గబ్బిలాలు చేరి విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఈ విషయమై పలుమార్లు పై అధికారులకు నివేదికలు ఇచ్చినా స్పందన లేదు.వెంటనే ఆ భవనాన్ని కూల్చివేసి కొత్త తరగతి గదులు నిర్మించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, వెంటనే నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణ మధ్యలో నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను విద్యార్థుల భద్రత దృష్ట్యా వేరే మార్గానికి మళ్లించాలని కూడా కోరారు.
అమృనాయక్ తండాలో…
ఇక్కడి ప్రభుత్వ పాఠశాల,అంగన్వాడి కేంద్రానికి ప్రహరీ గోడ లేదు.దీంతో పశువులు ఆవరణలోకి వస్తున్నాయి.తాగునీటి సౌకర్యం లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.వెంటనే తాగునీటి వసతి కల్పించి,ప్రహరీ గోడ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు ఉండాలని వీరయ్య సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు,పరిశుభ్రమైన మరుగుదొడ్లు,విద్యుత్,కూర్చునే బెంచీలు,సరిపడా తరగతి గదులు, పచ్చదనం ఉండాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి,ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన,కంప్యూటర్ విద్య,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా పేద,మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని,అదే సమాజ అభివృద్ధికి పునాది అవుతుందని అన్నారు.ఈ సర్వేలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్,కేవీపీఎస్ జిల్లా నాయకులు జిన్నా లచ్చయ్య,అంగన్వాడి ఉపాధ్యాయులు మంగమ్మ,ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

