
తొర్రూరు, జూలై 16 (నమస్తే న్యూస్):
పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రత్యేక చొరవతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల మొదటి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 45 రోజుల శిక్షణా కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకోగా,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లు అందజేశారు.మొదటి బ్యాచ్‌కు విశేష స్పందన రావడంతో శిక్షణ పొందలేకపోయిన మరికొంత మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు రెండో బ్యాచ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను తొర్రూరు క్యాంప్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఎస్ఎస్సీ (10వ తరగతి), ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.కంప్యూటర్ పరిజ్ఞానం ప్రస్తుత కాలంలో ఉపాధి అవకాశాలకు ఎంతో దోహదపడుతుందని,ఈ ఉచిత శిక్షణ ద్వారా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
