- రోడ్డు అభివృద్ధి పనులకు ప్రజల సహకారం అవసరం.
- ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్.
నర్సింహులపేట, జూలై 2 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో చేపట్టిన బైపాస్ రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గురువారం పరిశీలించారు. పొట్టి శ్రీరాములు బజార్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రూ.10 లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల పురోగతిని ఆయన గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జినుకల రమేష్,అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ, నర్సింహులపేటలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజల విజ్ఞప్తి మేరకు బైపాస్ రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రోడ్డు విస్తరణ పనుల కారణంగా తాత్కాలికంగా ఎదురయ్యే అసౌకర్యాలను ప్రజలు సహనంతో భరించి అధికారులకు సహకరించాలని కోరారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

