Type Here to Get Search Results !

మాదక ద్రవ్యాల సమాచారం ఇస్తే రూ.5,000 రివార్డ్:సీఐ ఎల్.పవన్ కుమార్.

  • మాదక ద్రవ్యాలపై మరిపెడలో భారీ అవగాహన ర్యాలీ.
  • యువతే దేశ భవిష్యత్తు అని చాటిన సీఐ ఎల్.పవన్ కుమార్.



డోర్నకల్/మరిపెడ,జూన్ 26(నమస్తే న్యూస్).

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు శుక్రవారం భారీ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

స్థానిక ప్రజలు,విద్యార్థులు,యువకుల భాగస్వామ్యంతో మరిపెడ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు."సే నో టు డ్రగ్స్", "మత్తు వద్దు - బతుకు ముద్దు" అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది.అనంతరం కార్గిల్ సెంటర్‌లో వందలాది మంది విద్యార్థులు,యువకులు,మహిళలు మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా మరిపెడ సీఐ ఎల్.పవన్ కుమార్ మాట్లాడుతూ,ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశం మన భారతదేశమని,గంజాయి,డ్రగ్స్,ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడుకుంటే దేశ భవిష్యత్తును కాపాడుకున్నట్లేనని స్పష్టం చేశారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,ఎలాంటి అనుమానాలు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సమాచారం ఇస్తే రూ.5,000 రివార్డ్: సీఐ పవన్ కుమార్.

గంజాయి సాగు,అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన పక్కా సమాచారం అందించిన వారికి మరిపెడ పోలీస్ శాఖ తరఫున రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని సీఐ ప్రకటించారు.సమాచారం ఇచ్చిన వారి పేర్లు,వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని,ఎలాంటి భయం లేకుండా 100 డయల్ చేయవచ్చని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు గండ్రాతి సతీష్,ప్రభాకర్ రెడ్డి,పోలీసు సిబ్బంది,ఉపాధ్యాయులు,స్థానిక ప్రజాప్రతినిధులు,విద్యార్థులు,యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని,తమ వంతు సహకారం అందిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.