భూ భారతి రీ-సర్వేపై అక్కిరాల గ్రామంలో అవగాహన సదస్సు.
నర్సింహులపేట, జూలై 1 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామపంచాయతీ పరిధిలోని అక్కిరాల గ్రామానికి సంబంధించిన భూ భారతి - భూ రీ సర్వే అవగాహన సదస్సు బుధవారం జయపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామసభ రూపంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ బాబు రైతులకు భూ భారతి విధానం, రీ-సర్వే ప్రక్రియపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ యాజమాన్య హక్కులను స్పష్టంగా నమోదు చేసేందుకు భూ భారతి సమగ్ర ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు.భూ భారతి ద్వారా ఆధునిక సాంకేతికతైన డ్రోన్లు, రోవర్స్, జియో-కోఆర్డినేట్ల సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే నిర్వహించి, ఖచ్చితమైన హద్దులతో డిజిటల్ మ్యాపులను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వే పూర్తయిన ప్రతి భూకమతానికి శాశ్వత గుర్తింపు సంఖ్యగా భూధార్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే భూముల కొనుగోలు, విక్రయాలు, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుందని వివరించారు. భూ రికార్డుల పరిశీలన, నాలా మార్పిడి, సర్వే మ్యాపుల వీక్షణ తదితర సేవలను భూ భారతి పోర్టల్ ద్వారా ఒకే వేదికపై పొందవచ్చని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో, ఆర్ ఐ శ్రావణ్ కుమార్,వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్,సర్వేయర్ శ్రీ నిత్య,గ్రామపంచాయతీ కార్యదర్శి సుధాకర్, జీపీఓ,ఉపసర్పంచ్ చుక్క వేణు కుమార్, జిపిఓ బిక్షపతి, నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

