పెన్షన్ దరఖాస్తుకు లంచం డిమాండ్… ఏసీబీ వలలో ఇద్దరు ఉద్యోగులు.
(నమస్తే న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 01)
సికింద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. పెన్షన్ మంజూరు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగిని వద్ద నుండి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ గంగాసాని శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం, పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ అరవింద్ మొదట రూ.15,000 లంచం కోరాడు. బాధితురాలు అంత మొత్తం ఇవ్వలేనని పలుమార్లు వేడుకున్నప్పటికీ, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ డబ్బును తన సహచరుడు రమేష్‌కు అందజేయాలని అరవింద్ సూచించాడు.
అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్రణాళికతో ఉచ్చుపట్టారు. బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్ లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో అరవింద్ పాత్ర కూడా వెలుగులోకి రావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుండి రూ.13,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి డిమాండ్ ఎదురైతే ప్రజలు భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని పిలుపునిచ్చారు.

