Type Here to Get Search Results !

పరాక్వాట్ రసాయనాన్ని పూర్తిగా నిషేధించాలి.

పరాక్వాట్ రసాయనాన్ని పూర్తిగా నిషేధించాలి.


కలుపు నివారణ ప్రత్యామ్నాయాలపై  రైతులకు అవగాహన కల్పించాలి.





(నమస్తే న్యూస్ డెస్క్, హైదరాబాద్,ఏప్రిల్ 01)

తెలంగాణ ప్రభుత్వం పరాక్వాట్ (Paraquat) అనే ప్రమాదకర రసాయన కీటకనాశిని వినియోగంపై తాత్కాలికంగా 60 రోజుల నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మానవ ఆరోగ్యం, పశువులపై దుష్ప్రభావాలు, అలాగే పర్యావరణానికి కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర గెజిట్‌లో ఈ ఉత్తర్వులు ప్రచురితమవగా, వెంటనే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే కేవలం 60 రోజుల తాత్కాలిక నిషేధంతో సమస్య పూర్తిగా పరిష్కారం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరాక్వాట్ వంటి ప్రమాదకర రసాయనాలు రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, పర్యావరణ సమతౌల్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రసాయనాన్ని సులభంగా వినియోగించడం వల్ల క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

రైతు సంఘాలు, ప్రజాసంఘాలు మాత్రం ఈ విషయంలో ప్రభుత్వాన్ని మరింత కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. పరాక్వాట్‌పై పూర్తి స్థాయి శాశ్వత నిషేధం విధించడంతో పాటు, కలుపు నివారణకు సురక్షితమైన ప్రత్యామ్నాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి.

అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సేంద్రియ విధానాలు, యాంత్రిక కలుపు నివారణ పద్ధతులు వంటి ప్రత్యామ్నాయాలను రైతులకు చేరవేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం తాత్కాలిక నిషేధంతో బాధ్యత పూర్తయినట్లు కాకుండా, దీర్ఘకాలిక పరిష్కారాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.