మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి.
ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలి.
మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
(నమస్తే న్యూస్, మరిపెడ, ఏప్రిల్ 05)
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ మరియు 12వ వార్డుల్లో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, పారిశుధ్య కార్యక్రమాలను ఆదివారం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో ఎదురైన నీటి నిల్వలు, మురుగు కాలువల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు వేగవంతంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పరిశీలన సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో ఈ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు నిల్వై దోమల వ్యాప్తి, వ్యాధుల ప్రమాదం పెరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల ద్వారా ఆ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రభుత్వ సూచనల మేరకు మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. చెత్త నిర్వహణ, కాలువల శుభ్రత, నీటి నిల్వలు నివారించడం వంటి అంశాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అజీజ్, గంధసిరి భిక్షపతి, గుండగాని వెంకన్న, గుండగాని వేణు తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కూడా ఈ పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కావడంతో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.

