రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై మాలోత్ సురేష్.
(నమస్తే న్యూస్,నర్సింహులపేట,ఏప్రిల్ 02)
మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్థానిక ఎస్సై మాలోతు సురేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి వాహనదారులకు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ఎస్సై మాలోతు సురేష్ మాట్లాడుతూ, కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగం అలవాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గ్రామస్థులు కూడా రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.


